శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 05, 2020 , 01:00:20

పల్లెల్లో చురుకుగా ‘ప్రగతి’ పనులు

పల్లెల్లో చురుకుగా ‘ప్రగతి’ పనులు

నిజామాబాద్‌ సిటీ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామాల్లో రెండోవిడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ఇందులో చేపట్టాల్సిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నా వారిపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. గ్రామాల్లో  పరిశుభ్రత, మొక్కలను రక్షించడంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన అధికారులు, సర్పంచులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కలెక్టర్‌ గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. ఆకస్మికంగా తనిఖీ చేసి విధుల్లో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టాన్ని పక్కగా అమలు చేస్తోంది. 


చట్టం ప్రకారం చర్యలు..

పల్లె ప్రగతి కార్యక్రమంలో పరిశుభ్రత, డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామాల నిర్మాణాలు, విద్యుత్‌వైర్లు, లైన్ల ఆధునీకరణ పనులు ప్రారంభించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి గత నెల 25న జరిపిన సమీక్షా సమావేశంలో ప్రతి గ్రామంలోనూ వైకుంఠధామాలు, శ్మశాన వాటికలు, కంపోస్ట్‌షెడ్‌ పనులు మొదలు పెట్టి 29లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా కొన్ని గ్రామాల్లో  సర్పంచులు, నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు వేశారు. పంచాయతీరాజ్‌ చట్టం, 2018లోని సెక్షన్‌ 37 ప్రకారం సర్పంచ్‌ తన విధులను నిర్వర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు వారు సామర్థ్య లేమితో తరుచుగా పంచాయతీ కార్యక్రమాలు, గ్రామాభివృద్ధిని కుంటుపరుస్తున్న సందర్భంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి చట్టంలో ఉంది. ఇందులో భాగంగా నవీపేట్‌ మండల శివతండాలో  వైకుంఠధామాలు, కంపోస్ట్‌ షెడ్‌ పనులు మొదలు పెట్టకపోవడం, డిచ్‌పల్లి మండలంలోని వెస్లీతండా, నడిపల్లి తండా, అమృతాపూర్‌, యానంపల్లి తండా, బర్దీపూర్‌, గొల్లపల్లి, బీబీపూర్‌, నక్కలగుట్ట తండా గ్రామాల్లో శ్మశానవాటికల పనులు మొదలు పెట్టకపోవడంతో పంచాయతీరాజ్‌ చట్టం నిబంధనల మేరకు గ్రామ పంచాయతీల సర్పంచులకు విధుల్లో నిరక్ష్యంగా వ్యవహరించారని నోటీసులు జారీ చేశారు. 


logo