శనివారం 30 మే 2020
Nizamabad - Mar 05, 2020 , 00:57:42

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇందూరు: ఇంటర్మీడియెట్‌ 2019-20 వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి దాసరి ఒడ్డెన్న తెలిపారు. బుధవారం మొదటి సంవత్సరం లాంగ్వేజ్‌ (తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ, ఒకేషనల్‌, జనరల్‌ ఫౌండేషన్‌ కోర్సు) పరీక్షలు జరిగాయని తెలిపారు. జనరల్‌ విద్యార్థులు మొత్తం 18,310 మందికి గాను 17,657 హాజరు కాగా 653 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో 2,314 మందికి గాను 2,083 మంది హాజరు కాగా 231 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తం 20,624 మందికి గాను  19,740 మంది హాజరు కాగా 884 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఆర్యనగర్‌లోని ఎస్సార్‌ కళాశాల, ధర్మారంలోని సాంఘిక సంక్షేమ కళాశాల, ఆర్మూర్‌లో బాలికల కళాశాల, మోడల్‌ కళాశాల మరికొన్ని కళాశాలలను సందర్శించారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్ల పై సంతృప్తిని వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్‌ వెంట డీఐఈవో దాసరి ఒడ్డెన్న, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యుడు చిన్నయ్య తదితరులు ఉన్నారు. 


ఒకరు డిబార్‌..

నగరంలోని విశ్వశాంతి జూనియర్‌ కళాశాలలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న మహ్మద్‌ నోమన్‌ అహ్మద్‌ను ప్లయింగ్‌ స్వాడ్‌ చంద్రవిఠల్‌ బృందం డిబార్‌ చేశారు. ప్లయింగ్‌ స్వాడ్‌ రెండు బృందాలు పది సెంటర్లను, సిట్టింగ్‌ స్కాడ్లు ఆరు పరీక్షా కేంద్రాలను, డీఐఈవో ఆరు సెంటర్లను తనిఖీలు  చేసి పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. 


ఇంటర్‌ పరీక్షా కేంద్రాల తనిఖీ

జిల్లా కేంద్రంలోని ఇంటర్‌ పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ పర్యటించి పరిశీలించారు. బుధవారం ఆయన సీఎస్‌ఐ జూనియర్‌ కళాశాల, ఆర్మూర్‌ రోడ్డులోని ఎస్సార్‌ జూనియర్‌ కళాశాలలో పర్యటించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఏర్పాట్ల పై సంబంధిత ముఖ్య పర్యవేక్షకులు, ప్రిన్సిపాల్స్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష సమయం పూర్తి అయ్యి విద్యార్థులు వెళ్లిపోయే వరకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఇతర మందులు, తాగునీరు అందుబాటులో ఉంచాలని, కాపియింగ్‌కు అవకాశం ఇవ్వవద్దని ఆదేశించారు.


logo