శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 04, 2020 , 05:12:37

పట్టణ ప్రగతి అద్భుత అవకాశం

పట్టణ ప్రగతి అద్భుత అవకాశం
  • ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలి
  • కాలనీల్లో సమస్యలు పరిష్కరించుకోవాలి
  • బల్దియాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం
  • రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
  • పట్ణణ ప్రగతిలో భాగంగా ఇందూరులో ‘హరితహారం డే’
  • మూడుగంటల పాటు బస్తీల్లో తిరిగి.. మొక్కలు నాటిన మంత్రి

పల్లె ప్రగతి స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతిని ప్రారంభించారని, ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు తమ వాడలను ఆదర్శంగా తీర్చిదిద్దుకునేందుకు అవకాశం వచ్చిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలో పలు గల్లీల్లో ఆయన పర్యటించారు. మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులంతా కలిసి పాదయాత్రలు చేస్తూ గల్లీల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని, గుర్తించిన సమస్యలను కేటగిరీల వారీగా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వెళ్లాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు మంగళవారం హరితహారం డేగా నామకరణం చేసి అందరితో మొక్కలు నాటించడంపై కలెక్టర్‌ను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. 


నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: పల్లె ప్రగతి స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతిని ప్రారంభించారని, ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు తమ వాడలను ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అద్భుత అవకాశం ఉందని, అక్కడి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహదావకాశమిది అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం  నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని పలు గల్లీల్లో ఆయన పర్యటించారు. మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమం పల్లె జనాన్ని చైతన్యపర్చి గ్రామాలను అన్ని రకాలుగా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు దోహదపడిందని, ఈ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గత నెల 24 నుంచి ఈనెల 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం లో ప్రధానంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులంతా కలిసి పాదయాత్రలు చేస్తున్నామని అన్నారు. ఆ పాదయాత్రలో గుర్తించిన సమస్యలను కేటగిరీల వారీగా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వెళ్లాలనేది ఈ కార్యక్రమం ముఖ్య  ఉద్దేశమన్నారు. పట్టణాలను గ్రీన్‌సిటీలకు మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని తెలిపారు. పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు మంగళవారం హరితహారం డేగా నామకరణం చేసి అందరితో  మొక్కలు నాటించడంపై కలెక్టర్‌ నారాయణరెడ్డిని మం త్రి ఈ సందర్భంగా అభినందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని, మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.  కార్యక్రమంలో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, అదనపు కలెక్టర్‌ లత, డీఎఫ్‌వో సునీల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, మూడు మున్సిపాలిటీల చైర్‌పర్సనులు రాజశ్రీ, పద్మ, వినీత, మున్సిపల్‌ కమిషనర్లు శైలజ, గంగాధర్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం, ఆర్డీవో వెంకటయ్య, డీసీవో సింహాచలం, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


గల్లీల్లో పర్యటించి.. మొక్కలు నాటి..

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం నిజామాబాద్‌ నగర వీధుల్లో పర్యటించారు. ఇరుకు గల్లీల్లో పాదయాత్ర చేశారు. సమస్యలు తిష్టవేసి ఉన్న ప్రాంతాలకు నడిచివెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మూడు గంటల పాటు ఆయన బస్తీబాట పట్టారు. అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, నగర మేయర్‌ నీతూకిరణ్‌,  కలెక్టర్‌ నారాయణరెడ్డిలతో కలిసి ఆయన పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్తీల్లో తిరిగారు. డివిజన్‌ నంబర్‌ 46 పరిధలోని వీక్లీమార్కెట్‌, పూలాంగ్‌ ప్రాంతాల్లో కలియదిరిగారు. ఇరుకైన వీధుల్లో తిరగుతూ డ్రైనేజీ వ్యవస్థ అస్త్యవస్తంగా ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే వాటిని బాగు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానికులు మంత్రికి తమ సమస్యలను విన్నవించారు. మంత్రి ఓపిగ్గా స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి హరితహారం డేలో పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయించారు. విరివిగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించుకోవాలని సూచించారు. తద్వారా గ్రీన్‌సిటీగా మార్చాలని కోరారు. అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ ఆకుల లతిత, నగర మేయర్‌ నీతూ కిరణ్‌ మంత్రి తోపాటు మొక్కలు నాటారు. అనంతరం అవరసరమైన చోట్ల సీసీ రోడ్లకు మంత్రి భూమి పూజచేశారు. 


 పట్టణాలను గ్రీన్‌సిటీలుగా మార్చుకుందాం 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా నగరాలు, పట్టణాలను గ్రీన్‌ సిటీలుగా మార్చుకోవడానికి ప్రతి ఒక్క రూ ముందుకు రావాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, మేయర్‌ నీతూ కిరణ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, తదితరులతో కలిసి నాలుగు మున్సిపాలిటీలకు ట్రాక్టర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌  ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో పరిశుభ్రతతో పాటు మొక్కలు పెంచే కార్యక్రమం ప్రాధాన్యతగా తీసుకొని నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ తన పరిధిలోని నిధులతో ప్రతి మున్సిపాలిటీలో నాటిన మొక్కలకు నీటిని అందించడానికి ప్రత్యేకంగా కొ త్తగా ఒక ట్రాక్టర్‌, ఒక ట్యాంకర్‌ను అందించారని తెలిపారు. ట్రాక్టర్లు, ట్యాంకర్లను కేవలం మొక్కల సంరక్షణకు నీటిని అందిచడానికి మాత్రమే వినియోగించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్లకు మంత్రి సూచించారు. నాటిన మొక్కలు అన్ని బతికేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తికి అనుగుణంగా ట్రాక్టర్లను అందించినందుకు జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. పట్టణ ప్రగతిలో నిర్దేశించిన అన్ని పనులను పూర్తి చేసి పట్టణాలను సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. 


వేరే పనుల కోసం ట్రాక్టర్లను వినియోగిస్తే చర్యలు: కలెక్టర్‌  

కొత్త మున్సిపల్‌ చట్టంలో మొక్కల పెంపకం పకడ్బందీగా చేపట్టాలని స్పష్టంగా పేర్కొనబడిందని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయడం, నీటిని క్రమం తప్పకుండా అందించడం ద్వారానే వాటి సంరక్షణ సాధ్యమని తెలిపారు. ఇందుకోసం ప్రతి మున్సిపాలిటీకి ఒక ట్రాక్టర్‌ను, ఒక ట్యాంకర్‌ను కేవలం మొక్కలకు నీటిని అందించడానికి జిల్లా యంత్రాంగం ద్వారా కొనుగోలు చేసి అందజేసినట్లు తెలిపారు. కేవలం మొ క్కల కోసం అందజేసిన ఈ ట్రాక్టర్లను వేరే పనులకు ఉపయోగిస్తే సంబంధిత మున్సిపాలిటీలకు రూ. 5వేల జరిమానా విధిస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లత, డీఎఫ్‌వో సునిల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, మూడు మున్సిపాలిటీల చైర్‌పర్సనులు రాజశ్రీ, పద్మ, వినీత, మున్సిపల్‌ కమిషనర్లు శైలజ, గంగాధర్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం, ఆర్డీవో వెంకటయ్య, డీసీవో సింహాచలం, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo