శనివారం 30 మే 2020
Nizamabad - Mar 04, 2020 , 05:11:23

పోలీసుల పనితీరుపై ‘ఫోకస్‌'

పోలీసుల పనితీరుపై ‘ఫోకస్‌'
  • ఫ్రెండ్లీ పోలీస్‌ దిశగా మరో కార్యక్రమం
  • పోలీసుస్టేషన్ల వారీగా...‘ఫోకస్‌ గ్రూపులు’
  • ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయ సేకరణ
  • త్వరలో అన్ని ఠాణాల్లో అమలు

కొన్ని పోలీసు స్టేషన్లలో బాధితుల పట్ల సిబ్బంది అనుచితంగా, అమానుషంగా ప్రవర్తించడంపై ఇటీవల డీజీపీ సీరియస్‌ తీసుకున్నారు. నేపథ్యంలో పోలీసు స్టేషన్లలో సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణకు ఫోకస్‌ గ్రూపులు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ గ్రూపుల్లో ఆయా ఠాణాల పరిధిలోని యువత, రైతులు, కార్మికులు, వయోధికులు, ఉపాధ్యాయులు, మహిళలు, విద్యార్థులు ఉంటారు. ఈ బృందాల్లోని సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, పోలీసుల పనితీరుపై వీరి నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు. పనితీరును మెరుగుపర్చుకోవడం, ఠాణాకు వచ్చే బాధితులతో మానవీయ కోణంలో ప్రవర్తించడం, వారి వ్యక్తిగత గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించకుండా చర్యలు చేపడతారు. 

-నిజామాబాద్‌ సిటీ విలేకరి


నిజామాబాద్‌ సిటీ: పోలీసు సిబ్బంది తమ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని, పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులతో మానవీయ కోణంలో ప్రవర్తించాలని, వారి వ్యక్తిగత గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించవద్దని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కొన్ని పోలీసు స్టేషన్లలో బాధితుల పట్ల సిబ్బంది అనుచితంగా, అమానుషంగా ప్రవర్తించడంపై డీజీపీ సీరియస్‌ తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. ప్రభుత్వ సూచనలతో ఇప్పటికే పోలీస్‌శాఖ ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని అమలు చేస్తున్నది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఆధునిక టెక్నాలజీ వినియోగంలో రాష్ట్ర పోలీస్‌శాఖ దేశానికి ఆదర్శంగా నిలిచింది. విప్లవాత్మక మార్పులతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి పోలీసు సిబ్బంది పనితీరుపై అభిప్రాయాలను సేకరించనుంది. త్వరలోనే అన్ని పోలీసు స్టేషన్‌ పరిధిలలో ఫోకస్‌ గ్రూపులను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.


ఫోకస్‌ గ్రూపు అంటే ఏమిటీ...

పోలీసు స్టేషన్లలో సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణకు పోలీసు స్టేషన్ల వారీగా ఫోకస్‌ గ్రూపులు ఏర్పాటు కానున్నాయి. ఈ గ్రూపుల్లో ఆయా ఠాణాల పరిధిలోని యువత, రైతులు, కార్మికులు, వయోధికులు, ఉపాధ్యాయులు, మహిళలు, విద్యార్థులు ఉంటారు. ఈ బృందాల్లోని సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, పోలీసుల పనితీరుపై వీరి నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు. ఈ ప్రక్రియతో ప్రజలతో పోలీసు సిబ్బంది వ్యవహరించే తీరు మెరుగపడుతుందని తెలంగాణ పోలీసుశాఖ భావిస్తోంది. ఉన్నతాధికారి నుంచి హోంగార్డు వరకు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలతో మానవీయ కోణంలో ప్రవర్తించాలని, వ్యక్తి గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోను భంగం కలిగించకూడదని, అలా చేస్తే కఠిన చర్యలను తెలంగాణ పోలీసుశాఖ తీసుకోనుంది. 


logo