సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Mar 03, 2020 , 01:20:50

ప్రగతి ‘వెలుగులు’

ప్రగతి ‘వెలుగులు’

ఖలీల్‌వాడి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. పారిశుద్ధ్యం, విద్యుత్‌ సమస్యల పరిష్కారం, వీధుల శ్రుభం, మొక్కలు నాటడం, శిథిలా భవనాల తొలగింపు వంటి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. దీంతో పట్టణాల్లో కొత్త రూపు సంతరించుకుంటున్నది. కాగా, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి పెద్దఎత్తున వివిధ పనులు చేపడుతున్నారు. స్తంభాలు సరిచేయడం, కొత్త స్తంభాల ఏర్పాటు, లైన్ల మరమ్మతులు, ఇతర విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి సంబంధించి విద్యుత్‌శాఖ సిబ్బంది ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. దీంతో వార్డులు, డివిజన్లలో విద్యుత్‌ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సుదర్శన్‌ ఆధ్వర్యంలో ఆశాఖ యంత్రాంగం ఈ పనుల్లో నిమగ్నమైంది. ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని వారు కోరిన మేరకు పనులు చేపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, నగర మేయర్‌, మున్సిపల్‌ అధికారులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వాడవాడలా కలియతిరిగి ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. వెనువెంటనే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి డివిజన్‌కు స్పెషల్‌ అధికారిని నియమించారు. కాగా, ఒక్కో డివిజన్‌ రూ. 10లక్షలు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యుత్‌ మరమ్మతులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. కాగా, ప్రతి వాడలో పారిశుద్ధ్యం, పచ్చదనం, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, ఎల్‌ఈడీ బల్చులు ఇలా ప్రతి ఒక్క పనిని త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. జిల్లాలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మూడు డివిజన్లలో భీమ్‌గల్‌, ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి కార్యక్రమం గత నెల 24 నుంచి ఈనెల 4వ తేదీ వరకు నిర్వహించబడుతుందని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సుదర్శనం తెలిపారు. ఇందులో భాగంగా విద్యుత్‌ సంస్థకు చెందిన అధికారులను, డివిజన్‌, వార్డుకు ఒక్కరు చొప్పున బాధ్యతలను అప్పగించామని తెలిపారు. ఈ పనులు ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ ఆధ్వర్యంలో డివిజన్‌, వార్డుల వారీగా నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ ప్రగతికి సంబంధించి అదనంగా ఎక్కడైనా ఇంకా పనులు కావాలని ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే, అవికూడా పూర్తి చేస్తామని తెలిపారు. నూతనంగా లైనులు మాత్రం వేస్తున్నామన్నారు. పట్టణ ప్రగతికి సంబంధించి అన్ని పనులను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 


logo