శనివారం 30 మే 2020
Nizamabad - Mar 03, 2020 , 01:10:42

సహకార సంఘాలు కల్ప వృక్షాలు

సహకార సంఘాలు కల్ప వృక్షాలు

వర్ని: సహకార సంఘాలు కల్ప వృక్షాల్లాంటివని, రైతులను అప్పుల ఊబినుంచి బయట పడేసే దిశలో సహకార సంఘాలు పనిచేయాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలోని వర్ని సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్పీకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్‌గా నామాల సాయిబాబు, సంఘం పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కొత్త పంథాలో తీసుకెళ్ల్లాలని సూచించారు. రైతు సమన్వయ సమితి సభ్యులు, అధికారుల సమన్వయంతో పనిచేసి.. రైతులను అప్పుల ఊబినుంచి బయటకు తీయాల్సిన బాధ్యత సహకార సంఘాలపై ఉందన్నారు. అప్పు తీసుకునే రైతు డిపాజిట్‌ చేసే స్థాయికి ఎదిగేలా సహకార సంఘాలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో 906 సహకార సంఘాల్లో 38 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక సహకార సంఘాలు 25 ఉన్న నియోజకవర్గం బాన్సువాడ అని, రాష్ట్రంలో అత్యధికంగా 18 విండోలు బాన్సువాడ సెగ్మెంట్‌లో ఏకగ్రీవం కావడం గర్వంగా ఉందన్నారు. ఏకగ్రీవాల దిశలో సహకార సంఘాలను నడిపించినందుకు నియోజకవర్గ బాధ్యుడిగా రైతులకు స్పీకర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.1977లో మొదటిసారి దేశాయిపేట్‌ సహకార సంఘానికి అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం మొదలైనట్లు స్పీకర్‌ ఈ సందర్భంగా ఆనాటి సంగతులను గుర్తుచేశారు. 1987లో నిజామాబాద్‌ జిల్లా సహకార బ్యాంకుకు అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిపారు. ప్రస్తుతం అదేస్థానంలో సీఎం కేసీఆర్‌, రైతుల ఆశీర్వాదంతో తన తనయుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఎంపికైనందుకు స్పీకర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

మంజీరా నదిపై నాలులు చెక్‌డ్యాంలు

మంజీరా నదిపై నాలుగు చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బాన్సువాడ వద్ద రూ.16 కోట్లతో, బీర్కూర్‌ వద్ద రూ.28 కోట్లతో చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొడిచర్ల, సుంకిని వద్ద త్వరలో చెక్‌డ్యాంలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు. వర్షాకాలం నాటికి చెక్‌డ్యాంలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, జడ్పీటీసీలు హరిదాసు, భాస్కర్‌ రెడ్డి, నారోజి గంగారం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంజీవులు, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ పిట్ల శ్రీరాములు, సింగంపల్లి గంగారం, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు నానిబాబు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కల్లాల్‌ గిరి, కార్యదర్శి వెలగపూడి గోపాల్‌, వైస్‌ ఎంపీపీ బాల్‌రాజ్‌, సర్పంచ్‌ ఎంబడి పద్మ, నాయకులు మేక వీర్రాజు, నాగభూషణ్‌ం, శ్రీనగర్‌ రాజు, కులకర్ణి సంతోష్‌, కరీం, వంగలి సతీశ్‌, వెంకన్న, శ్రీహరి, కత్తి శంకర్‌, శివనాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

జీపీలకు ట్రాక్టర్లు అందజేసిన సభాపతి

రుద్రూర్‌: మండలంలోని బొప్పాపూర్‌ సర్పంచ్‌ సావిత్రిలింగం,  అంబం సర్పంచ్‌ కొర్వ భాగ్యభూషణ్‌కు నూతన ట్రాక్టర్లను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. జడ్పీటీసీ నారోజి గంగారాం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo