బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Mar 03, 2020 , 01:08:13

భీమ్‌గల్‌ పట్టణం సమగ్రంగా అభివృద్ధి చెందాలి

 భీమ్‌గల్‌ పట్టణం సమగ్రంగా అభివృద్ధి చెందాలి

భీమ్‌గల్‌ : బల్దియాగా మారిన భీమ్‌గల్‌ పట్టణం సమగ్రంగా అబివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించాలని, అదే లక్ష్యంతో పనులు జరగాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.భీమ్‌గల్‌ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇది వరకే రెండు సార్లు పాదయాత్ర నిర్వహించిన మంత్రి.. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పట్టణంలో మూడోసారి పాద యాత్ర నిర్వహించారు.కాగా, ఈసారి ఆయన ఆకస్మికంగా పాద యాత్ర నిర్వహించారు. 2వ, 7వ, 8వ వార్డుల్లోని ఆదర్శ నగర్‌, బాపూజీ నగర్‌, కస్తూర్బారోడ్డు, నందిగల్లి, ఎర్రోడి గల్లీ, బొదిరెగల్ల్లీ, అంగడి బజార్‌లో ఆయన కాలినడకన సందు సందులో కలియదిరిగారు. ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.వెంచర్లలో పది శాతం మున్సిపల్‌ భూములకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి బోర్డులు పెట్టాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.మొగిలి చెరువు సమీపంలో వైకుంఠధామాన్ని, నందిగల్లీ సమీపంలో వైకుంఠధామాన్ని పరిశీలించారు.వీటిలో టాయిలెట్లు, నీటి సౌకర్యం కల్పించాలని, మొక్కలు నాటాలని ఆదేశించారు.పట్టణంలో టాయిలెట్లు లేని రద్దీ ప్రదేశాలను చర్చించారు. తహసీల్దార్‌ కార్యాలయం, మండల పరిషత్‌ కార్యాలయం, ముచ్కూర్‌ చౌరస్తా వద్ద పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలని ఆదేశించారు. పాత పోలీస్‌ స్టేషన్‌ స్థలాన్ని పరిశీలించారు.ఇక్కడ ఉపయోగపడే కార్యక్రమం ఏది తీసుకోవచ్చో పరిశీలించాలని సూచించారు.ఎర్రోడి గల్లీలో పాత ఓపెన్‌ బావిని పరిశీలించారు.గల్లీల్లో డ్రైనేజీలు, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు.నూతనంగా మురికి కాలువలు, రోడ్లు ఎక్కడ నిర్మించాలనే విషయంలో అధికారులకు సూచనలు చేశారు.ప్రభుత్వ దవాఖానా, పశు వైద్యశాలను పరిశీలించారు. ప్రతిపైసా భీమ్‌గల్‌ పట్టణ అభివృద్ధికి వినియోగపడేలా, వృథా కాకుండా చూడాలని సూచించారు.ఎక్కడిక్కడ అధికారులకు తగు సలహాలు, సూచనలు చేశారు.పారిశుధ్యం, పచ్చదనంతో, అవసరమైన చోట పార్కులతో కూడిన సౌకర్యవంతమైన పట్టణంగా భీమ్‌గల్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో పనులు, చర్యలు ఉండాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మల్లెల రాజశ్రీ, ఆర్డీవో శ్రీనివాస్‌, ఏసీపీ రఘు, మున్సిపల్‌ పత్యేకాధికారి, డీసీవో సింహాచలం, ఎంపీపీ ఆర్మూర్‌ మహేశ్‌, మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌ గున్నాల బాల భగత్‌, కౌన్సిలర్‌లు దారవత్‌ లింగం, బొదిరె నర్సయ్య, జోగినపల్లి సతీశ్‌గౌడ్‌, సీహెచ్‌ గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్‌, నాయకులు మూత లిం బాద్రి, మల్లెల ప్రసాద్‌, తుక్కాజి నాయక్‌, ముల్క గంగాధర్‌, జవ్వాజి భూమయ్య, తహసీల్దార్‌ రాజేందర్‌, మున్సిపల్‌ ఏఈ రఘు, తదితరులు ఉన్నారు.


logo