శనివారం 30 మే 2020
Nizamabad - Mar 01, 2020 , 23:52:25

ఇక జిల్లా పాలనపై పట్టు

ఇక జిల్లా పాలనపై పట్టు

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఎన్నికల శకం ముగిసింది. అడగడుగునా ఎన్నికలతో జిల్లా పరిపాలన రెండడుగులు ముందుకు ఒకడుగు వెనక్కు అన్నట్లుగా కొనసాగింది. ఎన్నికలేవైనా జిల్లా యంత్రాంగం వాటిని విజయవంతంగా నిర్వహించాయి. ఉద్యోగుల భాగస్వామ్యంతో ఎన్నికలన్నీ పూర్తి చేశారు. ఇక పరిపాలనపై దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో మొదలుపెట్టి.. ఇక సంక్షేమ పథకాలను మరింత వేగిరంగా అర్హులకు దరిచేరేలా ప్రణాళికలు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలకు కొత్త టీమ్‌లను దించింది. పరిపాలన వ్యవస్థలో కొత్త శకానికి నాంది పలికింది. పలు సంస్కరణలతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. కొత్త చట్టాలైన మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టాలను ఇప్పటికే కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సన్నద్ధమైంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు .. ఈ రెండు కొత్త చట్టాల అమలు తీరును తెలియజేస్తున్నవి. గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా చట్టాలను రూపొందించి వాటి అమలులో భాగంగా  ప్రభుత్వం విస్తృత అవగాహనక కల్పిస్తున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ పలు దఫాలుగా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లా పరిపాలన పరుగులు పెట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని, కలెక్టర్లకు అన్ని అధికారాలు ఇచ్చామని చెప్పారు. ప్రత్యేక నిధిని కూడా కేటాయించి జిల్లా పరిధిలోని అత్యవసర పనులను పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాకు అడిషనల్‌ కలెక్టర్‌ పోస్టుతోపాటు స్థానిక సంస్థలకు కూడా ప్రత్యేకంగా ఓ అడిషనల్‌ కలెక్టర్‌ను ఇచ్చారు. చాలా ఏండ్ల తర్వాత మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఐఏఎస్‌ అధికారి కమిషనర్‌గా వచ్చారు. పాలనపరంగా ప్రభుత్వం ఎలాంటి మార్పులు కోరుకుంటున్నదో దీన్ని బట్టి అవగతమవుతున్నది. ఒక్కొక్కటిగా ఎన్నికలన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడు కొత్త టీం.. జిల్లా పరిపాలనపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించనున్నది. పెండింగ్‌ పనులకు మోక్షం లభించడంతో పాటు పథకాల అమలు మరింత శరవేగంగా ప్రజల దరికి చేరనున్నాయి. ఇక పరిపాలన పరంగా జిల్లా కొత్త పంథాలో వెళ్లనుంది. 

పల్లె ప్రగతి సక్సెస్‌.. పట్టణ ప్రగతికి స్ఫూర్తి.. 

కొత్త చట్టాల అమలు కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా జరుగుతున్నది. కలెక్టర్‌ నారాయణరెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు బీ చంద్రశేఖర్‌, బీఎస్‌ లత.. ఈ కొత్త టీమ్‌ ఉత్సాహంతో పనిచేస్తూ అధికారులతో సమన్వయంగా పనిచేయించడంలో సక్సెసవుతున్నారు. జిల్లాలో పల్లె ప్రగతి విజయవంతమైంది. పంచాయతీరాజ్‌ సమ్మేళనం  పేరుతో ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో చేపట్టిన ప్రగతిపై చర్చించడమే కాకుండా ఇంకా చేయాల్సిన ప్రగతి గురించి వివరంగా ఈ సమావేశంలో చర్చించారు. అధికారులను కార్యోన్ముఖుల్ని చేశారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఖాతరు చేయని పది మంది సర్పంచులకు కలెక్టర్‌ కొత్త చట్టాన్ని అనుసరించి నోటీసులిచ్చారు. ఒక ఉప సర్పంచ్‌ చెక్‌ పవర్‌ను కూడా రద్దు చేయడం కలకలం రేపింది. దీంతో కొత్త చట్టాల అమలు ఎంత పకడ్బందీగా ఉంటుందో ఇతరులకు అర్థమవుతున్నది. పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారు. గత నెల 24 నుంచి ఈ నెల 4 వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అనుసరించి పల్లె ప్రగతిలో ఈ పది రోజుల పాటు సమస్యలను తెలుసుకోవడం.. వాటిని క్రమానుగతంగా పరిష్కరించుకుంటూ వస్తారు. ఈ నెల 4తో ఇది ముగియగానే దీనిపై మరోసారి సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. జిల్లాలో భీమ్‌గల్‌ మున్సిపాలిటీ పరిధిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రెండు రోజుల పాటు పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌, బోధన్‌ ఎమ్మెల్యేలు పట్టణ ప్రగతిలో పాల్గొంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. పట్టణ ప్రగతిలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. 

పథకాల అమలు మరింత వేగం..

కొత్త పింఛన్ల అమలుతో పాటు పథకాలు ప్రజలకు దరి చేరే విషయంలో ఇక మరింత స్పీడ్‌ పెరగనున్నది. నిన్నటి వరకు ఎన్నికల విధుల్లో బిజీబిజీగా ఉన్న అధికార గణం ఇక పరిపాలనపై దృష్టి కేంద్రీకరించనున్నారు. డబుల్‌బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాల్లో కదలిక రానున్నది. ఇప్పటికే అర్బన్‌లో గృహ ప్రవేశానికి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని త్వరలో లబ్ధిదారులకు అందజేయనున్నారు. రూరల్‌ తదితర నియోజకవర్గాలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నూతన కలెక్టరేట్‌ మరో నెలరోజుల్లో అందుబాటులోకి రానున్నది. ప్యాకేజీ -21 పనులు శరవేగంగా ముందుకు సాగనున్నాయి. వీటిపై ఓసారి మంత్రి .. సీఎంవో స్మితాసబర్వాల్‌తో కలిసి పర్యవేక్షించారు. మరోమార్లు దీనిపై సమీక్ష జరగనున్నది. ఇప్పటికే కాళేశ్వరం నీరు వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీని తాకుతున్నాయి. ఆ కాలువ పరిధిలోని జిల్లాలోని చెరువులు నింపుతున్నారు. రబీ సీజన్‌కు ఢోకా లేకుండా పోయింది. వరిసాగు గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. దీంతో పాటు అభివృద్ధిలో కూడా గణనీయమైన మార్పు కనిపించనుంది. రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణలు, శ్మశాన వాటికల నిర్మాణలు, డంపింగ్‌ యార్డుల ఏర్పాటు.. ఇలా నిర్మాణ పనుల్లో కూడా వేగం పెరగనుంది. 

జిల్లాకు యువ అధికారులు..

కలెక్టర్‌ నారాయణరెడ్డితో పాటు అడిషనల్‌ కలెక్టర్‌గా బీ చంద్రశేఖర్‌ నియమితులైన విషయం తెలిసిందే. కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి జితేశ్‌ వీ పాటిల్‌ నియమితులయ్యారు. అటు పట్టణంలో నూతన చట్టాన్ని పకడ్బందీ అమలు చేయడంతో పాటు .. జిల్లా పరిపాలనపై కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లు తమదైన ముద్ర వేసుకోనున్నారు. ఇప్పటికే జిల్లాపై కలెక్టర్‌ పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఆయన జిల్లాకు బదిలీపై రావడంతోనే మున్సిపల్‌ ఎన్నికలు వచ్చాయి. అవి పూర్తి కాగానే సహకార ఎన్నికలు.. ఇలా ఎన్నికలను సజావుగా నిర్వహించే విషయంలో ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. వీరికి తోడు స్థానిక సంస్థలకు కూడా ప్రత్యేక అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌ లత రావడంతో పనిభారం విభజింపబడినైట్లెంది. కీలకమైన శాఖలపై కలెక్టర్‌ దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. 


logo