గురువారం 28 మే 2020
Nizamabad - Mar 01, 2020 , 23:50:23

పకడ్బందీగా పది పరీక్షలు

పకడ్బందీగా పది పరీక్షలు

ఇందూరు : ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ఈ నెల 4వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియెట్‌ అధికారులు పరీక్షల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 3వ తేదీన ఇన్విజిలేటర్లకు సీఎస్‌, డీవోలు శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలుపుకొని 38,666 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతించబోమని అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలా పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసుకొనేందుకు మానిటరింగ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు 45 మంది, డీవోలు 45 మంది మొత్తం 90 మందిని నియమించారు. 1088 మంది ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించనున్నారు. అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లు 19 మందిని నియమించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో అధికారులతో సహా ఎవరికీ సెల్‌ఫోన్‌ అనుమతించకూడదని నిబంధనలు పెట్టారు. సీఎస్‌, డీవోలకు మాత్రం పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందు, పరీక్ష ముగిసే అరగంట ముందు మాత్రమే సెల్‌ఫోన్‌ వాడుకొనేలా అనుమతినిచ్చారు. ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ రెండు బృందాలు ఏర్పాటు చేయగా.. ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులను నియమించారు. ఒకరు రెవెన్యూ ఆర్‌ఐ కేటగిరీకి చెందిన వారు, మరొకరు ఏఆర్‌ఎస్సై, జూనియర్‌ లెక్చరర్‌ను నియమించారు. సిట్టింగ్‌ స్కాడ్స్‌ను ఆరుగురిని నియమించగా, హైపవర్‌ కమిటీ మెంబర్‌గా ఎల్‌.రఘురాజ్‌ను నియమించారు. డిస్ట్రిక్‌ ఎగ్జామినేషన్‌ కమిటీగా ముగ్గురిని నియమించారు. వారిలో ఎ.చిన్నయ్య, కె.శివాజీ, జి.గంగారాంను నియమించారు.  పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమలులో ఉన్నందున ఇతరులు సంచరించేందుకు వీలుండదు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్‌, ముందుగా వచ్చే విద్యార్థుల కోసం కూర్చోవడానికి అన్ని వసతులు కల్పించారు. ప్రతి పరీక్షా సెంటర్లలో పీహెచ్‌సీకి సంబంధించిన ఏఎన్‌ఎం, ఆశవర్కర్లను నియమించారు. విద్యార్థుల వద్ద ఎలాంటి పత్రాలు లభించినా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేస్తారు. కిలో మీటర్‌ దూరం వరకు జిరాక్స్‌ సెంటర్లను మూసివేయిస్తారు. పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరిగేందుకు వీలుగా ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్కాడ్‌లను ఏర్పాటు చేశారు. 

గతేడాది 67శాతం ఉత్తీర్ణత..

గత సంవత్సరం 67శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రం మొత్తంలో 70శాతం ఫలితాలు సాధించగా, ఒకేషన్‌లో 94 శాతం సాధించారు. ఈ సంవత్సరం ప్రత్యేక తరగతుల నేపథ్యంలో నవంబర్‌ వరకు సిలబస్‌ పూర్తి చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియెట్‌లో 2వేల నుంచి 3వేల వరకు విద్యార్థులు పెరిగారు. కాగా విద్యార్థులకు ప్రత్యేకంగా 61 మంది కౌన్సెలింగ్‌ ఇచ్చే వారిని ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో డెస్క్‌ బెంచీలను కూడా ఏర్పాటు చేశారు. 


logo