శనివారం 30 మే 2020
Nizamabad - Mar 01, 2020 , 23:46:03

చురుగ్గా ‘పట్టణ ప్రగతి’

చురుగ్గా ‘పట్టణ ప్రగతి’

ఖలీల్‌వాడి:  పట్టణ ప్రగతిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా అన్నారు. నగరంలోని 43వ డివిజన్‌లో ఆదివారం కలెక్టర్‌ నారాయణరెడ్డి, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌తో కలిసి మొక్కలు నాటి డివిజన్‌ వీధుల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రైల్వేకమాన్‌ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో ప్రతి రోజు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని, అందుకు అనుగుణంగా అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రజలతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకుంటాన్నామని అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు, శిథిలావస్థలో ఉన్న స్తంభాల మార్పు, లూజు వైర్స్‌ తొలగింపు తదితర సమస్యలు ప్రజలు తమ దృష్టికి తెస్తున్నారని అన్నారు. ఈ పనులను కొనసాగించాడనికి ఔట్‌ సోర్సింగ్‌ కూలీలను తీసుకున్నామని అవసరమైతే శాశ్వత ప్రాతిపదిక కూడా తీసుకొని ఈ పనులను నిరంతరాయంగా కొనసాగిస్తామని అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులను, ప్రత్యేక అధికారులను సమాయత్తం చేసి ప్రజలకు సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

పట్టణ ప్రగతిని నిరంతరం కొనసాగిస్తాం.. 

కలెక్టర్‌ నారాయణరెడ్డి

పట్టణ ప్రగతిలో పేర్కొన్న అన్ని పనులు పూర్తి చేసేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజలు కూడా భాగస్వాములై వారి వంతు సహాయ సహకారాలు అందించినప్పుడు పూర్తిస్థాయిలో నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి వీలవుతుందని తెలిపారు. ఈ నెల 3న అన్ని డివిజన్లు, వార్డుల్లో ప్లాంటేషన్‌ డే నిర్వహిస్తున్నామని, ప్రతి వార్డులో రెండు వందలకు తక్కువ కాకుండా మొక్కలు నాటించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, రోడ్ల పైన చెత్త తొలగిస్తున్నారని, ఖాళీ స్థలాల్లో పెరిగిన చెట్లు, ముళ్ల పొదలను తొలగించాలని యజమానులకు నోటీసులు జారీ చేయనున్నామని తెలిపారు. వారు స్పందించకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అనంతరం రఘునాథ చెరువు వద్ద పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, జిల్లా అధికారులు అభిషేక్‌ సింగ్‌, కిషన్‌రావు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


logo