బుధవారం 27 మే 2020
Nizamabad - Mar 01, 2020 , 23:45:10

వారాంతపు సంతకు స్థల పరిశీలన

వారాంతపు సంతకు స్థల పరిశీలన

శక్కర్‌నగర్‌: బోధన్‌లో ప్రతీ ఆదివారం నిర్వహించే వారాంతపు సంత స్థల మార్పులో భాగంగా శక్కర్‌నగర్‌లోని ఫ్యాక్టరీ మైదానాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివారం పరిశీలించారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి శనివారం బోధన్‌ పర్యటనలో భాగంగా ఇచ్చిన ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేస్తున్నట్లు ఆర్డీవో గోపీరాం వివరించారు. ఆర్డీవోతోపాటు మున్సిపల్‌ కమిషనర్‌ లింగంపల్లి శివానందం, చైర్మన్‌ తూము పద్మావతి, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి శక్కర్‌నగర్‌కు వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలంలో నూతనంగా నిర్మించి నిరుపయోగంగా ఉన్న మినీ స్టేడియాన్ని కూడా మార్కెట్‌కు వినియోగించే విషయంలో సంబంధిత అధికారులతో చర్చించాలని ఆర్డీవో మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. ఈ స్థలాన్ని చదును చేయడంతో పాటు, విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు పట్టణ ప్రగతిలో భాగంగా పలు ప్రాంతాల్లో వేస్తున్న విద్యుత్‌ స్థంభాలతో పాటు ఈ ప్రాంతంలో కూడా విద్యుత్‌ స్థంభాలు వేయించాలని కమిషనర్‌కు సూచించారు. ఈ స్థలంలో ఉన్న శిథిలావస్తకు చేరిన గోడలను తొలగించాలని అన్నారు. వచ్చే ఆదివారం నాటికి వారాంతపు సంత ఇక్కడే ప్రారంభించేలా చర్యలు చేపడతామని ఆర్డీవో అన్నారు. ఈ స్థలానికి చెందిన వివరాలను ఎన్డీఎస్‌ఎల్‌ కోర్‌కమిటీ అధికారి ఖాలేద్‌ అలీని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ మార్కెట్‌ కొనసాగే విషయంలో ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి, కౌన్సిలర్లు శరత్‌రెడ్డి, మీర్‌ నజీర్‌ అలీ, ధూప్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo