ఆదివారం 31 మే 2020
Nizamabad - Mar 01, 2020 , 23:29:44

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వం

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వం

శక్కర్‌నగర్‌: కేంద్ర ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నదని రాష్ట్ర ముస్లిం లా బోర్డు మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్‌ అస్మా జాహేర్‌ అన్నారు. ప్రధాని మోదీ ఒకదానివెనుక ఒక కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఆదివారం బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జమాతే ఉల్మా ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు.  సమావేశానికి ముఖ్య అతిథిగా అస్మా హాజరై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. పౌరసత్వ బిల్లు కారణంగా ముస్లిముల మనోభావాలు దెబ్బతిన్నాయని, రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం చేపడుతున్న చర్యలు శోచనీయమని అన్నారు. ముస్లిములు దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడ్డారని, కొత్తకొత్తగా చేపట్టే చర్యలతో భయపడేది లేదన్నారు. ప్రజాభిప్రాయాలను గౌరవించాల్సిన ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా చర్యలకు పాల్పడితే పతనం తప్పదని హెచ్చరించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళనలు చేసే విధంగా నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నార్సీ బిల్లును ఉపసంహరించే వరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి ఆయేషా ఫాతిమా ఆమేర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎన్నార్సీని వ్యతిరేకించడంపై ముస్లిముల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించే చర్యలకు పాల్పడుతున్న కేంద్రం ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అన్నారు. ముస్లిములు ఎన్సార్సీకి వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాలకు తమవంతు పూర్తి మద్దతు అందజేస్తామని, వారి వెంటే ఉంటామని అన్నారు. అనంతరం సయిదా అర్జీమన్‌ రజ్వీ, బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రజితాయాదవ్‌తోపాటు పలువురు హాజరై ప్రసంగించారు. కార్యక్రమాన్ని జమాతే ఉల్మా ప్రతినిథులు మౌలానా మసూదీ రజ్వీ, గులాం యాసీన్‌, ఆబీద్‌ ఫారూఖీ, అబ్దుల్‌ బాఖీ, అఫ్సర్‌, సుల్తాన్‌ ఖాద్రీ తదితరులు పర్యవేక్షించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


logo