బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 01, 2020 , 01:36:31

తొమ్మిదో పాలకవర్గం @ డీసీసీబీ

తొమ్మిదో పాలకవర్గం @ డీసీసీబీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) ప్రస్థానం మొదలై దాదాపుగా ఏడు దశాబ్దాలు గడుస్తోంది. ఇప్పటి వరకు పలు పర్యాయాలుగా అనేక మంది డీసీసీబీ పాలకవర్గంలో స్థానం పొందారు. డైరెక్టర్‌ పదవులను, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను అలంకరించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌గా ప్రస్థానం మొదలుపెట్టి అచెంలంచెలుగా డీసీసీబీ, టెస్కాబ్‌ వరకూ ఎదిగిన వారెందరో ఉన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోనూ డీసీసీబీకి సారథ్యం వహించిన వారిలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులైన వారు లేకపోలేరు. కొత్తగా ఏర్పడిన పాలకవర్గంతో డీసీసీబీలో ఇప్పటి వరకు తొమ్మిది పాలకవర్గాలు కొలువుదీరాయి. మొత్తం 8 మంది సారథ్యం వహించారు. ఒకరు మాత్రమే రెండు సార్లు చైర్మన్‌గా పనిచేసి రికార్డు సృష్టించారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరిగిన డీసీసీబీ పాలకవర్గాల కూర్పులో.. చైర్మన్‌గా పనిచేసిన వారిలో అత్యధిక మంది కామారెడ్డి జిల్లాకు చెందిన వారు ఉండడం ఆసక్తి రేపుతోంది. ఇందులో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కూడా ఉండడం విశేషం.


రైతులకు పెన్నిధి..

సన్న, చిన్న కారు రైతుల అవసరాలను తీర్చడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌)లు ఏడు దశాబ్దాలుగా అద్భుతమైన సేవలు అందిస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులు కేవలం వ్యాపార కోణంలో, పరిమిత వర్గాలకే ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులు రైతులకు రుణాలు అందజేస్తూ ఏళ్లుగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. రాయితీపై ఎరువులు, విత్తనాలను సైతం సకాలంలో పంపిణీ చేస్తూ.. యావత్‌ రైతాంగాన్ని తమవైపునకు తిప్పుకుంటున్న సంఘాలివే. సొసైటీలు అంటేనే గ్రామాల్లో ఒకరకమైన ప్రాధాన్యత నెలకొంటుంది. రైతులకు సంబంధించిన సంఘాలు కావడం, వ్యవసాయం మీద ఆధారపడిన వారే అత్యధికంగా ఉండడంతో, అందరితోనూ డీసీసీబీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న మూడంచెల సహకార వ్యవస్థలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కూడా సహకార సంఘాలు తొలిమెట్టుగా నిలుస్తుండడంతో.. అనేక మంది పీఏసీఎస్‌, డీసీసీబీ, టెస్కాబ్‌ పదవులపై ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా  డీసీసీబీ పాలకవర్గం తొలిసారిగా 1959, జులై 1న కొలువు తీరింది. నాడు తొలి చైర్మన్‌గా కాశీనాథరావు ముక్వాలకర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించి.. 1974, ఆగస్టు 30 వరకు దాదాపుగా 15 ఏళ్ల పాటుగా డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు.


కామారెడ్డి జిల్లాకు సముచిత స్థానం..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ సారథ్య బాధ్యతలు నిర్వహించిన వారిలో అధికులు కామారెడ్డి జిల్లాకు చెందిన వారే కావడం చెప్పుకోదగ్గ విషయం. ఇందులో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, ప్రస్తుత చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి కావడం కాకతాళీయమే. భిక్కనూర్‌ మండలం రామేశ్వరపల్లికి చెందిన ఎడ్ల రాజిరెడ్డి ఏకంగా రెండు పర్యాయాలు డీసీసీబీకి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1982 నుంచి 1985 వరకు ఒక పర్యాయం, 2005 నుంచి 2013 వరకు మరో పర్యాయం ఆయన చైర్మన్‌గా పనిచేశారు. అనంతరం బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చెందిన ప్రస్తుత శాసన సభాపతి పరిగె శ్రీనివాసరెడ్డి నాలుగో పాలకవర్గానికి నేతృత్వం వహించారు. 1987, ఆగస్టు 25 నుంచి మార్చి 30, 1990 వరకు ఆయన డీసీసీబీ చైర్మన్‌గా పనిచేయడం విశేషం. అనంతరం పిట్లం మండలం చిన్నకొడప్‌గల్‌కు చెందిన వెంకట్రామిరెడ్డికి 1992లో అవకాశం లభించింది. 1995, జనవరి 25 వరకు మూడేళ్ల పాటు సేవలు అందించి మధ్యలో ఎమ్మెల్సీగానూ పని చేశారు. ప్రస్తుతం ఏకగ్రీవంగా ఎన్నికైన డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి సైతం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చెందిన వారే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


logo