శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 29, 2020 , 00:44:42

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి

ప్రజల భాగస్వామ్యంతోనే  పట్టణాభివృద్ధి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: పట్టణాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆయన భీమ్‌గల్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండోరోజూ శుక్రవారం పాదయాత్ర చేశారు. పట్టణంలోని మూడు, ఐదు, పదకొండో వార్డుల పరిధిలోని భీమ్‌గల్‌ పట్టణ బైపాస్‌ రోడ్డు, నందిగల్లీ, అప్పర్‌టెకిడితో పాటు పలు వీధుల్లో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. పాదయాత్రలో వృద్ధులు మంత్రి వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించారు. మంత్రి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమకు పింఛన్‌ రావడం లేదని కొందరు మహిళలు, వృద్ధులు మంత్రికి విన్నవించారు. అర్హులందరికీ పింఛన్‌ అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమస్యలు పరిష్కరించడానికి అధికారులే మీవద్దకు వస్తారని, మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వారికి భరోసా కల్పించారు. బైపాస్‌ రోడ్డు వెంట పట్టణ ప్రగతి కమిటీల సభ్యులు, మహిళలు, మీడియా ప్రతినిధులు, అధికారులు, పోలీసులతో మొక్కలు నాటించిన మంత్రి.. తానూ పలు మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. 


నాటిన మొక్కలను సంరక్షించాలని, విరివిగా మొక్కలు నాటి భీమ్‌గల్‌లో పచ్చదనం వెల్లివిరిసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భీమ్‌గల్‌ పట్టణంలో సమస్యలను తెలుసుకోవడానికి పట్టణ ప్రగతిలో భాగంగా రెండు రోజుల పాటు పాదయాత్ర చేశామన్నారు. ఇరుకుగా ఉన్న రోడ్లలో మోరీల చెత్తను తరలించడానికి రెండు చిన్న ట్రాక్టర్లను త్వరలోనే సమకూర్చనున్నామని తెలిపారు. పట్టణంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో  పబ్లిక్‌ టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించామన్నారు. ఇలాంటి ప్రదేశాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మిస్తామన్నారు. ఆహ్లాదం కోసం రెండు, మూడు పార్కులు నిర్మించనున్నామని తెలిపారు. కల్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 


డ్రైనేజీలు, సీసీరోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రతి ఇంటికి పూల మొక్కలను, దోమలను నివారించే మొక్కలను అందించనున్నామన్నారు. తద్వారా పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తుందన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో ప్రజలు తమ పరిసరాల్లో సమస్యలను ముందుకొచ్చి వివరిస్తున్నారని తెలిపారు. తమ పట్టణం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది మంచి పరిణామమని మంత్రి పేర్కొన్నారు. భీమ్‌గల్‌ నుంచి వేల్పూర్‌ మీదుగా నిజామాబాద్‌కు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బస్సుల టికెట్‌ తీసుకొని కొద్దిదూరం ప్రయాణించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లత, జడ్పీ సీఈవో గోవింద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ, ఆర్డీవో శ్రీనివాస్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సుదర్శనం, డీసీవో సింహాచలం, భీమ్‌గల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గున్నాల బాలభగత్‌, కౌన్సిలర్లు మూత లత, బోదిరె నర్సయ్య, షమీమ్‌ బేగం, సతీష్‌ గౌడ్‌, దరావత్‌ లింగయ్య, తుమ్మ భూదేవి, జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, ఎంపీపీ ఆర్మూర్‌ మహేశ్‌, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ కన్వీనర్‌ దొన్కంటి నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్‌, జిల్లా కోఆప్షన్‌ మెంబర్‌ మొహిన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మూస లింబాద్రి, కన్నె సురేందర్‌, నియోజకవర్గ సమన్వయ సభ్యులు తుక్కాజీ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo