గురువారం 28 మే 2020
Nizamabad - Feb 29, 2020 , 00:41:33

రేపు బాబ్లీ ప్రాజెక్టు నీటి విడుదల

రేపు బాబ్లీ ప్రాజెక్టు   నీటి విడుదల

మెండోరా : సుప్రీంకోర్టు ఆదేశానుసారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి మార్చి 1న నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం ఎస్సారెస్పీ ఎస్‌ఈ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యం లో అధికారుల బృందం బాబ్లీ ప్రాజెక్ట్‌కు వెళ్లనున్నది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతీ ఏడాది మార్చి 1న బాబ్లీ గేట్లను తెరిచి దిగువన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. అదే విధంగా జూలై 1న గేట్లను ఎత్తి అక్టోబర్‌ 28న మూసివేయాలి. ఆ విధానంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. కేంద్ర జల సంఘం అధికారుల సమక్షంలో నీటి విడుదల జరగనున్నది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అధికారులతో పాటు ఎస్సారెస్పీ అధికారులు పాల్గొంటారు.  


బాబ్లీ ప్రాజెక్ట్‌ ప్రస్తుత నీటిమట్టం 1.31 టీఎంసీ

ఎగువన మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్టుకు వరద రావడానికి ఏటా ఎదురుచూపులు తప్పడం లేదు. సుప్రీంకోర్టు తీర్పుతో ఏటా బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మార్చి 1న బాబ్లీ గేట్లను ఎత్తి 0.60 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాలి. తిరిగి జూలై 1న మరోసారి బాబ్లీ గేట్లను ఎత్తివేసి 1 అక్టోబర్‌ 28 తేదీ వరకు గేట్లను తెరిచి దిగువకు నీటిని వదలాలి. ప్రసుత్తం బాబ్లీ ప్రాజెక్ట్టులో 1.31 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో భాగంగా మార్చి 1న త్రిసభ్య కమిటీ సమక్షంలో నీటిని విడుదల చేస్తారు. ఈ నీటిని విడుదల చేయడంతో ఎస్సారెస్పీ దిగువ ప్రాంతాల్లో జలకళను సంతరించుకోనుంది. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం 1080.40 అడుగులు, 53.536 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 2017 మార్చి 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తలేదు. 


నీటి నిల్వ లేకపోవడంతో గేట్లు ఎత్తలేదు. ఈ మార్చి 1న ఆదివారం ఎస్సారెస్పీ ఎస్‌ఈ, అధికారులు కలిసి త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో బాబ్లీ గేట్లను ఎత్తివేస్తారు. ఈ ఏడాది వానాకాలంలో ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి 165.001 టీఎంసీల వరద వచ్చి చేరింది. దీంతో వానాకాలం(ఖరీఫ్‌)కు స్వల్పంగా కాలువల నుంచి ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగింది. రబీ(యాసంగి)కి కాకతీయ, లక్ష్మి, సరస్వతీ కాలువల ద్వారా, ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు నీటి విడుదల ప్రసుత్తం కొనసాగుతోంది. రివర్స్‌ పంపింగ్‌ పనులు పూర్తికావడంతో కాళేశ్వరం జలాలు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును ముద్దాడాయి. దీంతో ఎగువన మహారాష్ట్ర నుంచి వరద రాకున్నా ఆయకట్టు రైతుకు కాళేశ్వరం నీటితో చింత లేకుండా పోయింది.  


logo