శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 28, 2020 , 01:01:29

భీమ్‌గల్‌ దళితవాడలో మంత్రి పాదయాత్ర

భీమ్‌గల్‌ దళితవాడలో మంత్రి పాదయాత్ర

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి/భీమ్‌గల్‌: రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి గురువారం భీమ్‌గల్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా భీమ్‌గల్‌ మున్సిపాలిటీలోని 10వ వార్డు, 2వ వార్డులోని దళిత వాడల్లో ఆయన పాదయాత్ర చేశారు. మూడు గంటల పాటు కలెక్టర్‌ నారాయణరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ, కౌన్సిలర్లు, అధికారులతో కలిసి గల్లీ గల్లీలో, సందుల్లో పాదయాత్ర చేస్తూ సమస్యలు గుర్తించారు. కాలనీల్లో ప్రజలు చెప్పే సమస్యలు విన్నారు. తాను గుర్తించిన సమస్యలతో పాటు ప్రజలు చెప్పిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం ఉదయం 8.45 గంటలకు 10 వార్డులో పాదయాత్ర మొదలు పెట్టారు. అక్కడి నుంచి 2వ వార్డు వరకు కాలనీల్లో రోడ్లను, మురికి కాలువలను పరిశీలించారు. వదులుగా ఉన్న విద్యుత్‌ వైర్లను పరిశీలించారు. ఒకటి రెండు చోట్ల మిషన్‌ భగీరథ నీళ్లు అందడంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తుప్పుపట్టిన విద్యుత్‌ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, వేళాడుతున్న విద్యుత్‌ తీగలను సరి చేయాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సుదర్శన్‌ను ఆదేశించారు. చెత్తను వెంటనే డంపింగ్‌ యార్డుకు తరలించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పలుచోట్ల రోడ్లపై చెత్తను పరిశీలించారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. హరిజన వాడలో నీరు నిల్వ ఉన్న గుంతను పరిశీలించారు. ఇక్కడ కొత్తగా మురికి కాలువ నిర్మాణం చేపట్టి నీరు బయటకు వెళ్లిపోయేలా చేయాలని సూచించారు. మరోచోట మురికి కాలువ కిందకు ఉండడంతో నీరు నిలిచి పోతుండడాన్ని గుర్తించి ఈ సమస్యకు పరిష్కరించాలని మున్సిపల్‌ ఇంజినీర్‌ను ఆదేశించారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా సమస్య ఉన్న చోట వెంటనే పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూస్‌ ఎస్‌ఈని ఫోన్‌లో ఆదేశించారు. నిధులు పక్కాగా వ్యయం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.


పట్టణ ప్రగతితో సమస్యల పరిష్కారం : మంత్రి వేముల 

పట్టణ ప్రగతి కార్యక్రమంతో చేపట్టిన పాదయాత్రలో ప్రజల కళ్లలో ఆనందం చూశానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన భీమ్‌గల్‌ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా దళిత వాడల్లో పాదయాత్ర చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ తలపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో తాను పట్టణంలో పర్యటించగా.. సమస్యలను పరిష్కరిస్తారనే ఆశను ప్రజల కళ్లల్లో చూశాననన్నారు. ప్రజాప్రతినిధిగా ఇది తనకు విలువైన అనుభవమని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పాదయాత్రలు చేసి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని, ఇందుకు అనుగుణంగా కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్యలు గుర్తించి ఒక్కటొక్కటిగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామన్నారు. మన గల్లీలు, మన ఊళ్లుబాగుంటేనే ప్రజలు కోరుకున్న అభివృద్ధి కనిపిస్తుందన్నారు. భీమ్‌గల్‌లో మరోసారి తిరిగి సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌తో సమాలోచన చేశామన్నారు. పట్టణంలో శ్మశాన వాటికలు పూర్తి చేయడానికి, సమీకృత మార్కెట్‌, ఒకటి లేదా రెండు పార్కులు ఏర్పాటు చేయడానికి కృషి జరుగుతోందన్నారు. 25 కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడానికి విద్యుత్‌ శాఖ అధికారులు రెండు రోజుల్లో చర్యలు తీసుకోనున్నారని తెలిపారు. చెత్త సేకరణకు, ఇతర పలు పనుల కోసం పలు సందుల్లోకి పెద్ద వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని గుర్తించామన్నారు. ఇందుకు రెండు చిన్న వాహనాలు అందించడానికి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అంగీకరించారని తెలిపారు. ప్రజలు తమవంతుగా శ్రమదానాలు అందించి తమ వాడలను బాగు చేసుకోవడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రోడ్లపై చెత్త వేయవద్దని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లత, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మల్లెల రాజశ్రీ, వైస్‌చైర్మన్‌ గున్నాల బాలభగత్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సుదర్శనం, మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, డీసీవో సింహాచలం, ఆర్డీవో శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, సర్వసమాజ్‌ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


logo