శనివారం 30 మే 2020
Nizamabad - Feb 28, 2020 , 00:15:50

చెట్లు నరికితే కఠిన చర్యలు

చెట్లు నరికితే కఠిన చర్యలు

 నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: చెట్లను ఎక్కడ ధ్వంసం చేసినా కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అటవీ అధికారి సునీల్‌, అదనపు సీపీ ఉషా విశ్వనాథ్‌ తదితర అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. కలెక్టర్లతో ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్వహించిన కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ విషయమై ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కానీ, చెట్ల నరికివేతపై కఠినంగా వ్యవహరించకుంటే హరితహారంలో చేసిన శ్రమ అంతా వృథా అవుతుందని కలెక్టర్‌ తెలిపారన్నారు. ఈ దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అడవిని ధ్వంసం చేసే వారిపైన, చెట్లను నరికే వారిపైన అక్రమ కలప రవాణా పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా చెట్లను నరకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, సొంత భూముల్లో పెరిగిన చెట్లను నరకడానికి సైతం ‘వాల్టా’ చట్టం ప్రకారం తప్పనిసరిగా అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఏ రకమైన కలప అయినా రవాణా జరుగుతుంటే కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెగ్యులర్‌గా అడవులను ధ్వంసం చేసే వారి విషయంలో దృష్టి పెట్టాలని, సామిల్లులలో రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహించి అక్రమ కలప ఉన్నట్లయితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇందుకు గాను రెవెన్యూ న్యూ పోలీసు అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. డివిజన్‌, మండల స్థాయిలో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, అక్రమంగా చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణా తదితర చర్యలు నిరోధించాలని ఆదేశించారు. అడవుల సమీపంలోని పంట భూముల్లో పంట నూర్పిడిల అనంతరం నిప్పు పెడుతుండడంతో అడవుల దహనానికి కారణమవుతుందని, అలాకాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొక్కలు, చెట్లు ఎండిపోతుంటే సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి అటవీశాఖ అధికారులు గోడపత్రులు, పాంప్లెట్స్‌ ముద్రించి ప్రజలకు అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఆర్డీవోలు వెంకటయ్య, శ్రీనివాస్‌, గోపీరాం, ఎఫ్‌డీవో రాంకిషన్‌, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు, పాల్గొన్నారు. 


logo