శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 27, 2020 , 01:01:19

నగరాభివృద్ధికి కృషిచేద్దాం

నగరాభివృద్ధికి కృషిచేద్దాం

ఖలీల్‌వాడీ: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి పాలకవర్గ (కౌన్సిల్‌) సమావేశం బుధవారం ప్రశాంతంగా ముగిసింది. కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బుధవారం కౌన్సిల్‌ సమావేశం మేయర్‌ నీతూ కిరణ్‌ అధ్యక్షతన జరిగింది. పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా మేయర్‌ దీని గురించే మాట్లాడారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని డివిజన్ల బాగు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నడూ లేనట్లుగా ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి అత్యధిక నిధులు వెచ్చిస్తున్నదని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డివిజన్‌కు రూ.10లక్షలను మంజూరు చేసిందని, ఈ నిధులను అవసరమైన వాటి కోసం వినియోగించుకోవాలని సూచించారు. నగరంలోని అరవై డివిజన్లకు .. డివిజన్‌కు రూ.10 లక్షల చొప్పున నిధుల కేటాయింపునకు కౌన్సిల్‌ తీర్మానం చేసింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒకరు భాగస్వాములై నగరాభివృద్ధికి కృషి చేయాలని మేయర్‌ కోరారు. పట్టణాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం ప్రతి కాలనీలో కనిపించాలని ఉద్ద్దేశంతో సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 24 నుంచి మార్చి 4వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందని, నగరంలో జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో నగర ప్రజలతో పాటు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి డివిజన్‌కు ఒక అధికారి పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సమావేశంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జీతేశ్‌ బి పాటిల్‌, కార్పొరేటర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.


logo