మంగళవారం 02 జూన్ 2020
Nizamabad - Feb 27, 2020 , 00:52:17

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

విద్యానగర్‌ : మార్చి 4 తేదీ నుంచి మార్చి 18 వరకు నిర్వహిచనున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు కామారెడ్డి జిల్లా నోడల్‌, విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 19,475 మంది విద్యార్థులు పరీక్షలను రాయను న్నారు. వీరిలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 9,882 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 9,593 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం  జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 30 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 30 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, నలుగురు సిట్టింగ్‌ స్కాడ్‌లను, 4 కస్టోడియన్లు, ఇద్దరు ఫ్లయింగ్‌ స్కాడ్‌లను, 400మందికి పైగా ఇన్విజిలేటర్లను నియమించారు.  

పరీక్షా కేంద్రాల వద్ద సౌకర్యాలు 

వేసవి దృష్టిలో పెట్టుకొని సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్ధులకు తాగు నీరు, వైద్య సిబ్బంది, పార్కింగ్‌ వసతి, వాష్‌ రూమ్స్‌, ఫ్యాన్‌ సౌకర్యం, రాత బల్లలు, విద్యుత్‌ వసతి, ఇంటర్నెట్‌ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు, జిరాక్స్‌ సెంటరుల మూసివేత, ప్రతి పరీక్ష సెంటర్‌ వద్ద ఒక కానిస్టేబుల్‌ను నియమించనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి.అరగంట ముందు విద్యార్ధులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం 8 గంటల్లోగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో కార్యాచరణ రూపొందించారు. పరీక్షల ఏర్పాట్ల పై ఇటీవల కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.logo