గురువారం 04 జూన్ 2020
Nizamabad - Feb 26, 2020 , 00:58:05

పనులు త్వరగా పూర్తి చేయాలి

పనులు త్వరగా పూర్తి చేయాలి

పల్లెప్రగతి కార్యక్రమాల్లో నిర్దేశించిన పనులను పెండింగ్‌లో లేకుండా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో పల్లెప్రగతికి సంబంధించి విద్యుత్‌ సమస్యల పరిష్కారంపై విద్యుత్‌శాఖ అధికారులు, ఎంపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి 1, 2లో చెడిపోయిన స్తంభాలను మార్చడం వంగిన స్తంభాలను సరి చేయడం, థర్డ్‌వైర్‌ ఏర్పాటు చేయడం, వదులుగా ఉన్న తీగలను సరిచేయడం తదితర అంశాలను నిర్దేశించడం జరిగిందన్నారు. ఇప్పటికీ చాలా పనులు పూర్తయినప్పటికీ మిగతా పెండింగ్‌ పనులు కూడా త్వరగా పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. 2180 లూజ్‌ వైర్లకు 1773 సరి చేశారని, 1708 వంగిన స్తంభాల్లో 1369 మార్చారని, 1491 తుప్పుపట్టిన స్తంభాలకు 1126 మార్చారని, 3419 థర్డ్‌వైర్‌లు ఏర్పాటు చేయవలసి ఉండగా 2538 చేశారని, లక్ష వీధిలైట్లు పెట్టాల్సి ఉండగా 98వేలు ఏర్పాటు చేశారని కలెక్టర్‌ వివరించారు. మిగతావి పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్‌ఫార్మార్ల ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. విధుల్లో అలసత్వంగా వహించిన బాల్కొండ ఏఈ, డిచ్‌పల్లి ఎంపీవోకు మెమోలు జారీ చేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ లత, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సుదర్శనం, డీపీవో జయసుధ, విద్యుత్‌శాఖ డీఈలు, ఏఈలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.


logo