శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 26, 2020 , 00:54:37

గురుకుల కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

 గురుకుల కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : గురుకుల డిగ్రీ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సదాశివనగర్‌ మండలం మర్కల్‌ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మర్కల్‌ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుశ్రేష్ట కాలేజీ ప్రహరీ దాటి పరిగెత్తుకుంటూ వచ్చి జాతీయ రహదారిపైన వెళ్తున్న లారీ కింద పడడానికి ప్రయత్నించింది. దీంతో లారీ డ్రైవర్‌ అప్రమత్తమై లారీని ఆపేసినప్పటికీ అప్పటికే ఆమెను లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థినిని చికిత్స కోసం కామారెడ్డికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌ తరలించారు. అనుశ్రేష్ట  బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. విద్యార్థినిది నిజామాబాద్‌ జిల్లాలోని రెంజల్‌ మండలంగా గుర్తించారు.  

సెల్‌ ఫోన్‌ వాడొద్దనడమే కారణమా...

అనుశ్రేష్ట ఆత్మహత్యాయత్నానికి సెల్‌ ఫోన్‌ వాడకూడదనే నిబంధనే కారణమని తెలుస్తున్నది. విద్యార్థిని తరచుగా ఫోన్‌ మాట్లాడుతున్నదనే విషయం తెలిసి కాలేజీ ప్రిన్సిపాల్‌ మందలించినట్లు సమాచారం. సోమవారం ఆమె తల్లిదండ్రులు కాలేజీకి రావడంతో వారి ముందు సెల్‌ఫోన్‌ విషయమై మందలించినట్లు తెలుస్తున్నది. మంగళవారం సైతం సెల్‌ ఫోన్‌లో మాట్లాడిన విషయం గమనించి ఓ అధ్యాపకురాలు మందలించడంతో తన వద్ద ఫోన్‌ లేదని చెప్పిన విద్యార్థిని, గట్టిగా బెదిరించడంతో సెల్‌ఫోన్‌ తీసుకు రాగా అందులో సిమ్‌ లేక పోవడం దానిని తీసుకు రమ్మని చెప్పగా గదిలోకి వెళ్లకుండా రోడ్డుపైకి పరుగులు పెట్టినట్లు తోటి విద్యార్థినులు పేర్కొంటున్నారు.     

విచారణ చేస్తున్నాం: శశాంక్‌రెడ్డి, డీఎస్పీ, ఎల్లారెడ్డి

ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని విషయమై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌ రెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థినిని చికిత్స కోసం తరలించామని, కాలేజికి వెళ్లి కారణాలు తెలుసుకుంటామని చెప్పారు. ముందుగా విద్యార్థినిని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని, వివరాలు స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  


logo