శనివారం 30 మే 2020
Nizamabad - Feb 26, 2020 , 00:53:46

ఏకగ్రీవాల్లో మంత్రి వేముల కృషి

ఏకగ్రీవాల్లో మంత్రి వేముల కృషి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఉమ్మడి జిల్లాలో సహకార ఎన్నికల్లో ఏకగ్రీవాలతో సొసైటీలు, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు ఎన్నిక కావడంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నీ తానై కృషి చేశారు. పీఏసీఎస్‌ల పరిధిలో డైరెక్టర్ల నుంచి డీసీసీబీ, డీసీఎంఎస్‌ సింహభాగం స్థానాలు ఏకగ్రీవాలు జరిగి వాటిని టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకోవడంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషి చేశారు. ఉమ్మడి జిల్లాలో 144 సొసైటీలకు గాను 136 సొసైటీలకు టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులే చైర్మన్లు అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మంత్రి సమన్వయంతో ముందుకు సాగుతూ సొసైటీల్లో టీఆర్‌ఎస్‌ బలాన్ని మునుపెన్నడూ లేని విధంగా పెంచడంలో మంత్రి కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం సొసైటీల్లో 8 మినహా మిగతా సొసైటీల చైర్మన్లందరూ టీఆర్‌ఎస్‌ వారే కావడంతో వారి మధ్య సమన్వయం సాధించి డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లను ఏకగ్రీవమయ్యేలా ఎమ్మెల్యేలతో కలిసి కృషి చేశారు. డైరెక్టర్‌ పదవులను ఏకగ్రీవం చేసుకొని డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాల్సిన ఆవశ్యకతను పీఏసీఎస్‌ చైర్మన్లకు వివరిస్తూ.. దిశానిర్దేశం చేశారు. మంగళవారం డైరెక్టర్‌ స్థానాలకు నామినేషన్లు వేసే అభ్యర్థులను ఎంపిక చేయడంలో మంత్రి దగ్గరుండి వ్యవహారం నడిపించారు. ఎక్కడ పార్టీకి చెందిన చైర్మన్ల నుంచి డబుల్‌ నామినేషన్‌ పడకూడదనే లక్ష్యంతో ముందుగానే పకడ్బందీగా దిశానిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ వారి సహకారంతో డైరెక్టర్‌ స్థానాలకు సింగిల్‌ నామినేషన్లు వేయించి ఏకగ్రీవం చేయించారు. పార్టీ అధిష్ఠానం సూచనలే ప్రామాణికంగా డైరెక్టర్ల ఎన్నికను ఏకగ్రీవం చేసుకొని చైర్మన్‌ స్థానాలకు అదే ఒరవడిలో ఎన్నిక పూర్తిచేసే లక్ష్యంతో మంత్రి ఉన్నారు. 

మంత్రిగారు.. మీ కృషికి ధన్యవాదాలు : బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌

సహకార ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఏకగ్రీవాలకు, పార్టీ అధిష్ఠానం సూచించిన విధంగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఏకగ్రీవాల వరకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసిన కృషికి నిదర్శనమైన సన్నివేశం మంగళవారం నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్నది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ మంత్రితో ‘అన్నా ఈ సహకార ఎన్నికల్లో అందరినీ సమన్వయం చేస్తూ మంచి ఫలితాలు సాధించిన మీకు ధన్యవాదాలు’ అన్నారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఎమ్మెల్యేలందరి సహకారంతోనే ఇలాంటి ఫలితాలు సాధించుకోగలిగామన్నారు. ఇందుకు మీ అందరికీ తానే ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. 


logo