శనివారం 16 జనవరి 2021
Nizamabad - Feb 26, 2020 , 00:36:51

సీఎం కేసీఆర్‌పై విశ్వాసానికి ఇదే నిదర్శనం

సీఎం కేసీఆర్‌పై విశ్వాసానికి ఇదే నిదర్శనం

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: సహకార ఎన్నికల్లో పీఏసీఎస్‌ చైర్మన్ల నుంచి డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల దాకా ఏకగ్రీవాల ఒరవడి కొనసాగడం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నాయకత్వంపై విశ్వాసానికి నిదర్శనమని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ల నామినేషన్‌ కార్యక్రమానికి ఆయన ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉమ్మడి జిల్లాలోని 144 పీఏసీఎస్‌ చైర్మన్లకు గాను 136 మంది చైర్మన్లు టీఆర్‌ఎస్‌ బలపరిచిన వారే ఎన్నికయ్యారన్నారు. వారి గెలుపు కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషి అభినందనీయమన్నారు. వారికి పార్టీ పక్షాన, తన తరఫున కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీబీ కేటగిరీ ఏలో 16 డైరెక్టర్‌ స్థానాలకు గాను 15 స్థానాల్లో సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. డీసీఎంఎస్‌లోనూ ఏ కేటగిరీ, బీ కేటగిరీలో మొత్తం స్థానాలకు సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుందన్నారు. సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యేలా కృషి చేసిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు ఎవరనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు.