బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 25, 2020 , 03:38:21

బస్తీ బాట

బస్తీ బాట

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ఇన్నేండ్లుగా పేరుకుపోయిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. కనీస సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఓ యజ్ఞంలా జరిగిన పల్లె ప్రగతి పల్లెజనాన్ని చైతన్యపర్చింది. ప్రజల్లో విస్తృత అవగాహన పెరిగింది. ఉద్యమ స్ఫూర్తితో ఆ కార్యక్రమం విజయవంతమైంది. ఇప్పుడు పట్టణప్రగతి అదే బాటన కొనసాగుతున్నది. బస్తీబాటతో పట్టణాలు కదులుతున్నాయి. అధికారులంతా బస్తీల్లో తిరుగుతున్నారు. ఏనాడూ గల్లీల్లో కనిపించని జిల్లా స్థాయి అధికారులు.. ఇప్పుడు జనానికి చేరువవుతన్నారు. సమస్యలు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. తమ దృష్టికి వచ్చిన వాటిని గుర్తించి నమోదు చేసుకుంటున్నారు. సత్వర పరిష్కారం వీలైతే అక్కడే చేసేస్తున్నారు. 


మిగిలిన వాటి పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పిచ్చిమొక్కలు, పొదలు తొలగించడం దగ్గర నుంచీ వంగిపోయిన విద్యుత్‌ స్తంభాలు సరిచేయడం.. చెత్త ఏరేసి పరిశుభ్రంగా ఉండేలా చూడడం.. తాగునీటి సరఫరా.. ఇలా అన్ని సమస్యలూ అధికారుల దృష్టికి వస్తున్నాయి. ఇన్నాళ్లూ చెప్పినా ఎవరూ వినలేదు.. ఇప్పుడు సమస్యల చెంతకే పెద్దసార్లు తరలిరావడంతో బస్తీజనంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇక బస్తీల తీరు మారుతుందనే నమ్మకం ఏర్పడింది. జిల్లాలో సోమవారం అన్ని మున్సిపాలిటీల పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. ఈ పదిరోజులు బస్తీబాట పట్టి అక్కడ గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ప్రతి వార్డుకు, డివిజన్‌కు ఓ ప్రత్యేకాధికారిని వేయడంతో అక్కడే ఉదయం గ్రామసభల మాదిరిగా మీటింగులు నిర్వహించుకొని పాదయాత్రలు చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. 


వాడ వాడలా.. కలియదిరుగుతున్న అధికార గణం.. 

పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వాడకు జిల్లా యంత్రాంగం తరలివెళ్లింది. పట్టణ ప్రజలతో కలిసి పాదయాత్రలు చేస్తున్నది. అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని 11వ డివిజన్‌ నాగారంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మేయర్‌ నీతూ కిరణ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భీమ్‌గల్‌ పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని పన్నెండు వార్డుల్లో కార్యక్రమం ప్రారంభమైంది. పదోవార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ గున్నాల బాలభగత్‌, కౌన్సిలర్లు, అధికారులు,  వార్డు కమిటీల సభ్యులు వార్డుల్లో తిరుగుతూ సమస్యలను గుర్తించారు. పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం భీమ్‌గల్‌ సర్వసమాజ్‌ కమిటీ సభ్యులు రూ.10 వేలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గోపు గంగాధర్‌, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రత్యేకాధికారి, డీసీవో సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని 4వ వార్డులో మున్సినల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 8వ వార్డులో అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌ లత ప్రారంభించారు. 


శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వార్డులను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకొనేందుకు కృషి చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. బోధన్‌ పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. బోధన్‌ పట్టణంలోని ఆయా వార్డుల్లో ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిని సోమవారం ఉదయం నుంచి ప్రారంభించారు. పట్టణంలోని 18వ వార్డులో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్‌ చైర్మన్‌ పద్మావతి మాట్లాడారు. ఆమెతో పాటు ఆర్డీవో గోపీరామ్‌ సైతం ప్రజలకు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి 25వ వార్డులో పొదలను తొలగించేందుకు గాను ఏర్పాటు చేసిన జేసీబీని చైర్మన్‌, అధికార యంత్రాంగం కలిసి ప్రారంభించారు. 


21వ వార్డులో పలు ప్రధాన సమస్యలను గుర్తించారు. పట్టణంలోని 38వ వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్లతో పాటు నియామకం చేసిన అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టే పారిశుద్ధ్యం, హరితహారం, విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసే విషయంలో అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం వరకు వార్డుల్లో పర్యటించిన అధికారులు సమస్యల పరిష్కారానికి గాను కావాల్సిన కూలీలను, మొరం, చదును చేయించేందుకు ట్రాక్టర్లను తదితర అంశాలపై మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. పట్టణంలో ప్రధానంగా మురికి కాలువల పరిశుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు ప్రధాన సమస్యలుగా కనిపించాయి. వీటితో పాటు మిగతా సమస్యలను కూడా గుర్తించాలని చైర్మన్‌ పద్మావతి, ఆర్డీవో గోపీరామ్‌ కౌన్సిలర్లకు, వార్డుల వారీగా నియామకం చేసిన అధికారులకు సూచించారు. logo