మంగళవారం 26 మే 2020
Nizamabad - Feb 25, 2020 , 03:35:57

బోదకాలు వ్యాధి సర్వే షురూ..

బోదకాలు వ్యాధి సర్వే షురూ..

ఖలీల్‌వాడి : జిల్లాలో బోదకాలు సర్వే చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశానుసారం జిల్లా యంత్రాంగం ఆదివారం నుంచి సర్వేకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో బోధకాలు సర్వే పక్కాగా చేసేందుకు ఎన్‌వీబీడీసీపీ అదనపు సంచాలకుడు అమర్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రక్తనమూనాల సేకరణ విషయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి పాఠశాలలో ఒకటి, రెండో తరగతి చదువుతున్న 1690 మంది విద్యార్థులకు రక్త నమూనాలు సేకరించడానికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రంగం సిద్ధం చేసింది. 


అధికారులు అప్రమత్తం..

జిల్లాలో గతంలో తెలంగాణ వ్యాప్తంగా బోదకాలు వాధి ప్రబలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా మళ్లీ బోదకాలు బాధితులు పెరగకుండా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో జిల్లాలో 1849 మంది బోదకాలు బారిన పడి చికిత్స చేయించుకుంటున్నారు. 


1,690 మంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరణ..

బోధకాలు వ్యాధి గుర్తింపులో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి, రెండో తరగతి విద్యార్థులు రక్తనమూనాలు సేకరించనున్నారు. ప్రస్తుతం వైద్యాధికారుల బృందం 1690 మం ది విద్యార్థుల రక్త నమూనా లు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో 20 మందికి పైగా కేసులు పాజిటివ్‌ అని తేలితే బోదకాలు వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోనున్నారు. జి ల్లా వ్యాప్తంగా నివారణ మాత్రలు పంపిణీ చేయాలని అదనపు సంచాలకుడు అమర్‌సింగ్‌ అధికారులకు సూచించా రు. ఇప్పటికే వైద్యశాఖ అధికారులు, సిబ్బంది కలిసి అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. 


బోదకాలు వ్యాధి లక్షణాలివి.. 

క్యూలెక్స్‌ దోమ కుట్టడంతో బోదకాలు వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి పైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్‌ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని మైక్రోపైలేరియా క్రి ములు మన శరీరంలోకి ప్రవేశించి మన లింపు నాళాల్లో పెరిగి పెద్దవుతాయి. అవి లింపు గ్రంథుల్లో చేరి ఉండిపోతాయి. ఇవి అక్కడ పెద్దగా పెరగడంతో బోదకాలు వ్యాధి బయటపడుతుంది. వీటి నుంచి వచ్చే కొన్ని విషతుల్యాలతో లింపు నాళాల్లో వాపు వస్తుంది. క్రిములు చనిపోయి లింపు నాళాల్లో అవరోధంగా మారడంతో వీటికి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా వ్యాప్తి చెందుతాయి. ఒక్కసారి వ్యాధి వచ్చిన తర్వాత తగ్గడం అనేది ఉండదు. దోమకాటుతో కలిగే ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి మం దులు వాడితే ఎలాంటి సమస్య ఉండదు. సకాలంలో గుర్తించకపోతే ఈ వ్యాధి ముదిరి ఎలిఫెంటరీగా తయారవుతుంది. 


జిల్లాలో 1849 మందికి బోదకాలు పింఛన్‌..

జిల్లాలో ఇప్పటికే 1849 మంది బోదకాలు వ్యాధిగ్రస్తులున్నారు. వీరి బాధలను అర్థం  చేసుకొన్న సీఎం కేసీఆర్‌.. బీడీ కార్మికులు, వితంతువులకు ఇచ్చినట్లే పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. గతంలో ఈ వ్యాధిగ్రస్తులకు రూ.వెయ్యి ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 2016 చెల్లిస్తున్నారు. logo