మంగళవారం 26 మే 2020
Nizamabad - Feb 24, 2020 , 02:21:52

ఘనంగా సేవాలాల్‌ జయంతి

ఘనంగా సేవాలాల్‌ జయంతి

ఇందూరు: తన జాతిని ఉద్ధరించడానికి పెళ్లి కూడా చేసుకోకుండా జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అని రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. ఆదివారం పాంగ్రా గ్రామంలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సేవాలాల్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆయన బోధనలను రామారావు మహరాజ్‌ ద్వారా చెప్పించి తన జాతి ప్రజలతో మార్పు తీసుకురావడానికి కృషి చేశారన్నారు. రామారావు మహరాజ్‌ కూడా తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా బంజారాల కోసం కృషి చేస్తున్నారని దవాఖానలో ఉన్న ఆయన ఈ సమాజం కోసం ఇంకా జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని గౌరవించడానికి వారి పండుగలలో వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవాలాల్‌ జయంతి అధికారికంగా నిర్వహించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.  జిల్లాకు గిరిజన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోటీ మంజూరు చేసిందని, అయితే బంజారా భవనంగా పేరు మార్పించి ఆ కోటీ రూపాయలను తిరిగి మంజూరు చేయించడానికి అదే విధంగా వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం తన నియోజకవర్గానికి మంజూరు చేసే నిధుల్లో మరో రూ. 50లక్షలు కూడా భవన నిర్మాణానికి అందజేస్తానని హామీ ఇచ్చారు. 


భవన నిర్మాణానికి సహాయ, సహకారాలు అందిస్తాం..

గిరిజన ప్రజలు విరాళాలు సేకరించి కష్టపడి సంపాదించుకున్న భూమిలో వారికి భవన నిర్మాణం జరగాల్సిందేనని, అందుకు తన వంతుగా సహాయ, సహకారాలు అందిస్తానని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. తండాలో జీవిస్తున్న వెనుకబడి ఉన్న ప్రజలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ముందు వరుసలో ఉన్న నాయకులదేనని 3వేల తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినందున వాటి అభివృద్ధికి అక్కడి ప్రజలను పైకి వచ్చే విధంగా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. నాయకులు విజ్ఞప్తి మేరకు సేవాలాల్‌ జయంతి స్థానిక సెలవు దినంగా ప్రకటించడానికి పరిశీలిస్తామని, ప్రభుత్వం కుటుంబ పెద్దగా కల్యాణలక్ష్మితో ఆడపిల్లల పెళ్ళిళ్లు జరిపించడానికి తనవంతు కృషి చేస్తుందని తెలిపారు. తమకు గిరిజన సంక్షేమ విద్యా సంస్థలలో అడ్మిషన్‌ ఇవ్వాలసిందిగా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎంతో మంది విద్యార్థులు జూన్‌ నెలలో వస్తున్నారని ఇందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలే నిదర్శనమని తెలిపారు. ఆయా సమాజాల్లో వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావాలని మహనీయుల ఆశయమని ఆ ఆశయాలకు అనుగుణంగా మనం పని చేసినప్పుడే వారికి అసలైన నివాళి అవుతుందని   పేర్కొన్నారు. 


తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే.. 

మూడు వేల తండాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలుగా మార్చాలంటే ఆయనకు మీ పై ఉన్న ప్రేమ ఎటువంటితో అర్థం చేసుకోవాని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. నగర మేయర్‌ నీతూ కిరణ్‌ మాట్లాడుతూ.. సేవాలాల్‌ ప్రజాసేవకు మారుపేరని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ పాండురంగ నాయక్‌, ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజినీర్‌ మెహన్‌నాయక్‌, జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ మెహస్‌సింగ్‌, ఆర్డీవో వెంకటయ్య, డీటీడబ్ల్యూవో సంధ్యారాణి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, సంఘ నాయకులు, గిరిజన ప్రజలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 


logo