గురువారం 04 జూన్ 2020
Nizamabad - Feb 23, 2020 , 03:28:31

జిల్లాను తాకిన కాళేశ్వర గంగ

జిల్లాను తాకిన కాళేశ్వర గంగ

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: ఎస్సారెస్పీకి దిగువన రెండు వందల కిలో మీటర్ల దూరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జలాలు ఉల్టా ఎత్తుకు ఎదురేగి ప్రవహిస్తూ ఎస్సారెస్పీ చెంతకు చేరాయి. యాసంగి పంటల కోసం వరద కాలువను కాళేశ్వరం జలాలతో నిండుగా నింపే ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం రాత్రి నుంచి రాంపూర్‌, రాజరాజేశ్వర్‌రావు పేట్‌ పంపు హౌసుల్లో రెండేసి మోటార్లను నడుపుతూ నిరంతరాయంగా నీటిని ఎగువకు ఎస్సారెస్పీ వద్ద వరద కాలువ జీరో పాయింట్‌ వరకు నింపే ప్రక్రియ కొనసాగుతున్నది. శనివారం సాయంత్రానికి కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలోని వరద కాలువ గేట్ల వద్ద జీరో పాయింట్‌కు చేరాయి. దీంతో ఎస్సారెస్పీ మొదలు చివరి దాకా వరద కాలువ జల కలను సంతరించుకుంది. యాసంగి కోసం తూముల ద్వారా చెరువులను నింపేందుకు అవరసమైన మట్టం వరకు వరద కాలువను నింపనున్నారు. పునర్జీవం పథకంతో గత సెప్టెంబరులో వరద కాలువను నిండుగా నింపిన కాళేశ్వరం జలాలు ఆరు నెలల లోపే మరో సారి నింపుతున్నాయి.


logo