శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 22, 2020 , 04:21:26

నేడే డీసీసీబీ నోటిఫికేషన్‌

నేడే డీసీసీబీ నోటిఫికేషన్‌

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ ఎన్నికల కోసం శనివారం జిల్లా సహకార శాఖ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. గురువారమే ప్రభుత్వం ఈ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అదే రోజు స్క్రూటినీ, ఉప సంహరణ నిర్వహిస్తారు. ఒకే నామినేషన్‌ వస్తే ఏకగ్రీవంగా డైరెక్టర్‌ స్థానాలను ప్రకటిస్తారు. డీసీసీబీకి 20 డైరెక్టర్‌ స్థానాలుంటాయి. ఇందులో పీఏసీఎస్‌ చైర్మన్లు 16 మంది ఉంటారు. మరో నలుగురు ఇతర కులవృత్తుల సంఘాల నుంచి పోటీ చేస్తారు. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాలు మొత్తం 10 ఉంటాయి. ఇందులో ఆరుగురు సొసైటీ చైర్మన్లు డైరెక్టర్‌ స్థానాల కోసం పోటీ చేస్తుండగా.. మరో నలుగురు ఇతర సంఘాల నుంచి బరిలో ఉంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎన్నికలు కావడంతో 144 సొసైటీ చైర్మన్లు ఈ డైరెక్టర్‌ స్థానాల ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ డీసీసీబీ డైరెక్టర్‌ స్థానాల కోసం డీసీసీబీలోని కొత్త భవనం.. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాల కోసం డీసీఎంఎస్‌ కార్యాలయ భవనంలో ఉంటుంది. ఈనెల 28న ఎన్నికలు రెండింటికీ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఏ క్లాస్‌.. బీ క్లాస్‌..

డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాలను ఏ క్లాస్‌, బీ క్లాస్‌గా విభజించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కూడా పూర్తి చేశారు. ఏ క్లాస్‌లో సొసైటీ చైర్మన్లు మాత్రమే డైరెక్టర్‌గా పోటీ చేసేందుకు అర్హులు. బీ క్లాస్‌లో ఇతర కులవృత్తుల సంఘాలకు చెందిన నాయకులు పోటీ చేస్తారు. ఇలా రెండు గ్రూపులుగా డైరెక్టర్‌ స్థానాలను విభజించారు. డీసీసీబీలో ఏ క్లాస్‌ నుంచి 16 మంది డైరెక్టర్లుగా పోటీ చేయనుండగా.. బీ క్లాస్‌ నుంచి నలుగురు పోటీ చేస్తారు. వీరికి ఏ క్లాస్‌ డైరెక్టర్ల కోసం ఉమ్మడి జిల్లాలోని 144 మంది సొసైటీ చైర్మన్లు  ఓటేయాల్సి ఉంటుంది. బీ క్లాస్‌కు చెందిన నలుగురు డైరెక్టర్ల కోసం 111 మంది నలుగురికి ఓటేస్తారు. డీసీఎంఎస్‌లో ఏ క్లాస్‌లో ఆరుగురు, బీ క్లాస్‌లో నలుగురు  ఉన్నారు. ఏ క్లాస్‌ నుంచి డైరెక్టర్‌ స్థానాలకు పోటీలో ఉన్న ఆరుగురికి 144 మంది సొసైటీ చైర్మన్లు ఓటేయాల్సి ఉంటుంది. బీ క్లాస్‌ నుంచి నలుగురి డైరెక్టర్ల కోసం ఓటరు జాబితాలో బీ క్లాస్‌ నుంచి ఉన్న ఏడుగురు ఓటేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజర్వేషన్లు కూడా పూర్తి చేశారు. ఓటింగ్‌ కోసం రిజర్వేషన్ల వారీగా బ్యాలెట్‌ పత్రాలను రూపొందించారు. ఈ మేరకు సర్వంసిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. 


నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ ఇలా.. 

ఈ నెల 25న నామినేషన్లు స్వీకరిస్తారు. అదే రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు స్క్రూటినీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. పోటీలో ఉన్న వారి తుది జాబితాను ప్రచురిస్తారు. ఈనెల 28న ఎన్నికలుంటాయి.  పోటిలో ఎవరూ లేకుండా ఒకటే నామినేషన్‌ వస్తే  డైరెక్టర్‌ స్థానానికి ఎన్నిక ఉండదు. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ ఎన్నికకు కూడా ఇదే విధంగా షెడ్యూల్‌ విడుదల చేశారు. 29న డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. logo