శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 21, 2020 , 05:53:19

‘డీసీసీబీ’ సందడి

‘డీసీసీబీ’ సందడి

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) డైరెక్టర్‌, చైర్మన్‌ పదవుల ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల ఎన్నికలకు గురువారం వేర్వేరుగా షెడ్యూల్‌ విడుదల చేసింది.

  • డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు నోటిఫికేషన్‌ విడుదల
  • డైరెక్టర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక కోసం షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం
  • 25న నామినేషన్ల దాఖలు.. అదేరోజు స్క్రూటినీ, ఉపసంహరణ
  • 28న ఎన్నికలు.. అదే రోజు ఫలితాలు
  • 29న చైర్మన్ల ఎన్నిక

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) డైరెక్టర్‌, చైర్మన్‌ పదవుల ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల ఎన్నికలకు గురువారం వేర్వేరుగా షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 20న షెడ్యూల్‌ విడుల చేసిన ప్రభుత్వం.. 22న ఎన్నికల అధికారులు షెడ్యూల్‌ విడుదల చేస్తారు. ఈ నెల 25న నామినేషన్లు స్వీకరిస్తారు. అదే రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు స్క్రూటినీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. పోటీలో ఉన్న వారి తుది జాబితాను ప్రచురిస్తారు. ఈ నెల 28న ఎన్నికలుంటాయి. పోటీలో ఎవరూ లేకుండా ఒకటే నామినేషన్‌ వస్తే డైరెక్టర్‌ స్థానానికి ఎన్నిక ఉండదు. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ ఎన్నికకు కూడా ఇదే విధంగా షెడ్యూల్‌ విడుదల చేశారు. 29న డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. 


ముందు డైరెక్టర్‌ పదవులకు.. ఆ తర్వాత చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలకు.. 

సహకార శాఖలో కీలకమైన డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 144 సొసైటీలకు 8 సొసైటీలు మినహా 136 సొసైటీ చైర్మన్లను టీఆర్‌ఎస్‌ దక్కించుకున్నది. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల పీఠాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడడం లాంఛనప్రాయమే. ముందుగా డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎన్నిక కావడంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. డీసీఎంఎస్‌ విభజన చేయాలని ప్రభుత్వం మొదట భావించినా.. దీనికి సీఎం కేసీఆర్‌ విముఖత వ్యక్తం చేయడంతో ఉమ్మడి జిల్లాకే దీని ఎన్నిక నిర్వహించనున్నారు. 


డీసీసీబీ కోసం ఉమ్మడి జిల్లాలో ఎన్నికైన 144 సొసైటీ చైర్మన్లతో పాటు 110 మంది బలహీనవర్గాల (వీకర్‌ సెక్షన్స్‌) నుంచి ఓటర్లుగా  ఉన్నారు. దీంతో డీసీసీబీ డైరెక్టర్ల పదవుల కోసం 254 మంది ఎన్నికల్లో పాల్గొంటారు. డీసీసీబీ డైరెక్టర్లు మొత్తం 20 మంది ఉంటారు. ఇందులో సహకార సంఘాల చైర్మన్లు 16 మంది ఉండగా.. ఇతర కులవృత్తులకు సంబంధించిన సంఘాలకు చెందిన వారు నలుగురు ఉంటారు. డీసీఎంఎస్‌లో మొత్తం ఓటర్లు 144 మంది సహకార సంఘాల చైర్మన్లతో పాటు ఏడుగురు వీకర్‌ సెక్షన్‌కు సంబంధిచిన వారిని ఓటర్లుగా చేర్చారు. మొత్తం 151 మంది ఓటర్లుగా డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నికల్లో పాల్గొంటారు. ఇందులో 10 మంది డైరెక్టర్లు ఉంటారు. ఇందులో ఆరుగురు పీఏసీఎస్‌ చైర్మన్లు ఉండగా.. నలుగురు ఇతర కులవృత్తులకు చెందిన సంఘాల నుంచి డైరెక్టర్లుగా పోటీ చేస్తారు. వీరిని ఎన్నుకున్న తర్వాత ఆ మరుసటి రోజు 29న డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌,వైస్‌ చైర్మన్‌ ఎన్నికలుంటాయి. ఈ ఎన్నికల్లో డైరెక్టర్లుగా ఎన్నికైనవారంతా ఓటేసి చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. కాగా.. డీసీసీబీ,డీసీఎంఎస్‌ డైరెక్టర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కించుకొనేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రైతులంతా గంపగుత్తగా టీఆర్‌ఎస్‌ పక్షాన నిలిచి కేసీఆర్‌కు జై కొట్టారు. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు టీఆర్‌ఎస్‌ వశమే కానున్నాయి. దీంతో ఎవరికి వారే తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 


సీల్డ్‌ కవర్‌ చైర్మన్‌..

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎన్నిక సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి వదిలారు. ఈ మేరకు జిల్లా పరిస్థితులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఇక్కడి ఫలితాలు, పరిస్థితులు, ఆశావహుల వివరాలను అధిష్టానానికి చేరవేశారు. జడ్పీ చైర్మన్‌ ఎన్నిక మాదిరిగానే చైర్మన్‌ ఎవరనేది సీఎం నిర్ణయించి సీల్డ్‌ కవర్‌లో పేరును పంపుతారు. చైర్మన్‌ ఎన్నికకు ముందు పార్టీ మీటింగ్‌ నిర్వహించి ఆ మేరకు అందరి సమక్షంలో సీల్డ్‌ కవర్‌ను తెరిచి అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటిస్తారు. దీనికి అందరూ కట్టుబడి ఉండాలి. ఆ మేరకు ఓటింగ్‌లో పాల్గొనాలి. దీంతో చైర్మన్‌ అభ్యర్థులెవరో తెలియక టీఆర్‌ఎస్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నా.. ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియక టెన్షన్‌ పడుతున్నారు. ఈ నెల 29న చైర్మన్ల ఎన్నికలుండడంతో ఆరోజు మధ్యాహ్నం వరకు చైర్మన్లు ఎవరనేది తేలిపోనుంది. అధిష్టానం నిర్ణయించిన వారే నామినేషన్‌ వేయనుండడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికలు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడనున్నాయి.   


logo