మంగళవారం 26 మే 2020
Nizamabad - Feb 21, 2020 , 05:50:36

త్వరలోనే టీయూకు నూతన వీసీ!

త్వరలోనే టీయూకు నూతన వీసీ!

15 ఏండ్ల క్రితం ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయానికి త్వరలోనే నూతన వీసీ రానున్నారు. ఈ ప్రకియ రెండు, మూడు వారాల్లో పూర్త య్యే అవకాశముంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో మరోసారి రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీల ఎంపిక తెరపైకి వచ్చింది.

  • ఈసీ సభ్యుల నియామకం కూడా..
  • సీఎం ప్రకటనతో మళ్లీ తెరపైకి..
  • రెండు, మూడు వారాల్లో ప్రక్రియ పూర్తి
  • సెర్చ్‌ కమిటీకి బాధ్యతలు
  • ఆశావహుల్లో జిల్లా వాసులు

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ : 15 ఏండ్ల క్రితం ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయానికి త్వరలోనే నూతన వీసీ రానున్నారు. ఈ ప్రకియ రెండు, మూడు వారాల్లో పూర్త య్యే అవకాశముంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో మరోసారి రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీల ఎంపిక తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు శాశ్వత వీసీల ని యామకంపై ఈ బుధవారమే సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగా ఉన్న వీసీల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ముందు గా సెర్చ్‌ కమిటీల నుంచి వివరాలు తెప్పించుకొని ఆయా వర్సిటీలకు ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ మెంబర్ల నియామకాలు కూడా చేపట్టాలని స్పష్టం చేశారు. వీసీల నియామక ప్రక్రియ పూర్తి చేసి అన్ని విశ్వవిద్యాలయాలకు శాశ్వత వీసీలను నియమించాలని కేసీఆర్‌ ఆదేశించడంతో తెలంగాణ విశ్వవిద్యాలయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. 


గత జూలైతో ముగిసిన వీసీ పదవీకాలం..

శాశ్వత వీసీలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వారీగా రెండు నెలల క్రితమే సెర్చ్‌ కమిటీలను నియమించింది. తెలంగాణ విశ్వవిద్యాలయ ఈసీ నామినీగా అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ వీఎస్‌ ప్రసాద్‌, యూజీసీ నామినీగా హైదరాబాద్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ అప్పారావు, రాష్ట్ర ప్రభుత్వ నామినీగా ప్రస్తుత చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ను నియమించారు. అయితే ఇప్పటి వరకు సెర్చ్‌ కమి టీ సమావేశం జరగలేదు. దీంతో వీసీ నియామక ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది. తాజాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సెర్చ్‌ కమిటీ సమావేశం రెండు, మూడు రోజుల్లో నిర్వహించే అవకాశముంది. గత ఏడాది జూలైతో తెలంగాణ విశ్వవిద్యాలయానికి వీసీ పదవీకాలం ముగింది. అప్పటి నుంచి వర్సిటీకి సీనియర్‌ ఐఏఎస్‌లను ఇన్‌చార్జిలుగా నియమిస్తూ వచ్చింది. తొలుత అనిల్‌ కుమార్‌, ఆయన తర్వాత నీతూప్రసాద్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఈ క్రమంలో పాలనాపరమైన ఇబ్బందులు వచ్చాయి. వారు సీనియర్‌ ఐఏఎస్‌లు కావడంతో వారి శాఖల పనుల్లోనే తలమునకలై ఉ న్నారు. దీంతో ఇటువైపు వారు వచ్చింది చాలా తక్కువ సమయాల్లోనే. 


పోటీలో ఉంది చాలా మందే..

తెలంగాణ విశ్వవిద్యాలయ వీసీ పోస్టుకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల తర్వాత మూడో వర్సిటీగా తెలంగాణ యూనివర్సిటీకి పేరుంది. దీనికి వీసీగా వచ్చేందుకు గతంలోనే రాష్ట్రంలోని వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు సుమారు 114 మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారు. వారితోపాటు దరఖాస్తు చేసుకోని వారిని కూడా సెర్చ్‌ కమిటీ పరిశీలించనున్నట్లు తెలిసింది. టీయూకు మొదటగా రెగ్యులర్‌ వీసీగా ప్రొఫెసర్‌ కాశీరాం, రెండో వీసీగా ప్రొఫెసర్‌ అక్బర్‌ అలీఖాన్‌, మూడో వీసీగా ప్రొఫెసర్‌ సాంబయ్య పనిచేశారు. వారి తర్వా త నాలుగో వీసీగా వచ్చేందుకు చాలామందే పోటీపడుతున్నారు. వారిలో మన జిల్లాకు చెందిన వారు ఐదుగురు తీవ్రంగా ప్రయత్నా లు చేస్తున్నట్లు తెలిసింది. కాకతీయ యూనివర్సిటీకి చెందిన సాయిలు గతంలో తెలంగాణ వర్సిటీకి రిజిస్ట్రార్‌గా కొద్దికాలం పనిచేశారు. ఆయనతోపాటు మరో ప్రొఫెసర్‌, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సులోచనారెడ్డి, ప్రొఫెసర్‌ అశోక్‌తోపాటు టీయూ ప్రారంభంలో ప్రత్యేక అధికారిగా పని చేసిన గంగాధర్‌ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. ఈయన కూడా ఇందూరు జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.


ఇప్పటికైనా మోక్షం కలిగేనా..?

తెలంగాణ విశ్వవిద్యాలయ శాశ్వత వీసీ ఎంపిక ప్రక్రియ ఇప్పటికైనా పూర్తి అయ్యేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏడెనిమిది నెలలుగా తెలంగాణ వర్సిటీకి వీసీ పోస్టు ఖాళీగా ఉంది. పాలనాపరమైన విషయాలతోపాటు అభివృద్ధి పరమైన కార్యకలాపాలు సాగాలంటే వీసీ తప్పకుండా ఉండాలి. ఇన్‌చార్జిలుగా పని చేసిన సీనియర్‌ ఐఏఎస్‌లు ఇక్కడికి వచ్చేందుకు వీలు కాకపోవడంతో కనీసం ఒక్కసారి కూడా విశ్వవిద్యాలయానికి రాలేదు. దీంతో వర్సిటీ పరిపాలన వ్యవస్థ గాడితప్పినట్లయ్యింది. రోజురోజుకూ కార్యకలాపాల నిర్వహణ సైతం కష్టంగా మారింది. వీసీ పోస్టుతోపాటు ఈసీ సభ్యులను కూడా నియమించే అవకాశముంది. దీనిలో మొత్తం తొమ్మిది మంది సభ్యులుంటారు. వారిలో వీసీ చైర్మన్‌గా, రిజిస్ట్రార్‌ కన్వీనర్‌గా, మెయిన్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయ ప్రతిపాదిత సభ్యుడు ఒకరు, ఉన్నత విద్య, కాలేజీయేట్‌ విద్య, ఆర్థిక శాఖల నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. వారి ఎంపిక కూడా వీసీ ఎంపిక పూర్తి కాగానే పూర్తి చేయనున్నట్లు సమాచారం.


logo