ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 19, 2020 , 02:28:28

సీఎం ‘ప్రగతి’ నిర్దేశం

సీఎం ‘ప్రగతి’ నిర్దేశం

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: పంచాయతీరాజ్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని, ఆ చట్టాన్ని అనుసరించి  సరైన పద్ధతిలో పనిజరగకపోతే అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు తప్పదని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. 85 శాతం మొక్కలు నాటి వాటిని సంరక్షించకున్నా.. వందశాతం పన్నులు వసూలు చేయకపోయినా.. ఇంకా చట్టంలోని అన్నింటినీ అమలు పర్చకపోయినా కఠిన చర్యలు పొందుపర్చబడ్డాయని, అందరూ జాగ్రత్తతో ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సీఎం హితబోధ చేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సమీక్షించారు. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు పాల్గొన్నారు. ఇప్పటి వరకు పల్లె ప్రగతిలో పెండింగ్‌లోఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పట్ణణ ప్రగతిని ఈనెల 24న ప్రారంభించి .. మార్చి 4న ముగించాలని ఆ మేరకు వార్డులు, డివిజన్ల వారీగా ప్రణాళఙకలు చేసుకోవాలన్నారు. పంచాయతీరాజ్‌ సమ్మేళన  సమావేశాలు ముగిసిన తర్వాత ఈనెల 25 వరకు సమయం ఇస్తామని, ఆ లోపు నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. సాలీనా బడ్జెట్‌, పంచవర్ష ప్రణాళికలు, గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఇలా అన్ని చేసుకొని దాని ప్రకారం పనులు చేసుకోవాలని సూచించారు.  సమావేశంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లు, మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ కమిషనర్‌ తదితరులు పాల్గొన్నారు. 

గజ్వేల్‌ పర్యటన..

గజ్వెల్‌లోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను కలెక్టర్ల బృందం పరిశీలించింది. వెజ్‌, నాన్‌వెజ్‌, పూల మార్కెట్‌ అన్నీ కలిసి ఒకేచోట  సమీకృత మార్కెట్‌ను జిల్లాల్లో కూడా నిర్మించుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. వైకుంఠధామం, అర్బన్‌ పార్కును కూడా కలెక్టర్ల బృందం పరిశీలించింది. జిల్లాలో ఇలాంటి వాటిని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించుకునేందుకు వీలుగా గజ్వెల్‌ పర్యటన కొనసాగింది.


logo