గురువారం 28 మే 2020
Nizamabad - Feb 19, 2020 , 02:23:12

సమ్మేళనానికి.. సర్వం సిద్ధం

సమ్మేళనానికి..  సర్వం సిద్ధం

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి :  కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమలు శరవేగంగా జరగనున్నది. పల్లెలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. ప్రతి ఒక్కరిలో చైతన్యం వెల్లివిరిసింది. పల్లెను బాగు చేసుకోవాలనే ఆలోచనకు నాంది పలికేలా చేసింది. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించే క్రమంలో పంచాయతీరాజ్‌ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఈనెల 11న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో పంచాయతీరాజ్‌ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. నేడు ఉదయం 11 గంటలకు నగరంలోని భూమారెడ్డి కన్వెషన్‌ సెంటర్‌లో ఈ సమావేశం జరగనున్నది. మంత్రితో పాటు పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొననున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం జరగనున్నది. 20న కామారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహిస్తారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా పాల్గొంటారు.

పంచాయతీరాజ్‌ చట్టం పకడ్బందీగా అమలు.. 

క్షేత్రస్థాయిలో గ్రామాలను బలోపేతం చేసేందుకు కొత్తగా పంచాయతీరాజ్‌ చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే క్రమంలో స్థానిక సంస్థల ప్రతినిధుల బాధ్యతలు,  కర్తవ్యం గురించి సవివరంగా తెలియజేసి పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వారిని కార్మోన్ముఖులను చేసే క్రమంలోనే సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ సమావేశంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి  సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల విధులను వివరిస్తారు.  పల్లెలను అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి పథంలో నడిపేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధులపై మంత్రి దిశానిర్ధేశం చేస్తారు. ప్రభుత్వ ఆలోచనలు, ఉద్దేశ్యాలను సమగ్రంగా అధికారులకు వివరించి అవి క్షేత్రస్థాయిలో అమలు చేసే క్రమంలో ఎవరి విధులు ఏమిటో తెలియనున్నారు.

పదిరోజుల్లో పురోగతి.. 

నేడు సమావేశం పూర్తయిన తర్వాత పదిరోజులు గడువిస్తారు. ఆ తర్వాత గ్రామాల వారీగా పురోగతి నివేదికను తెప్పించుకుంటారు. చేసే పని తూతూ మంత్రంగా ఉంటే కఠిన చర్యలు తప్పవు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసేలా ముందుగా పంచాయతీరాజ్‌ సమ్మేళనం ఏర్పాటు చేసి వారికి కార్యబోధ చేయనున్నారు. గతంలో మాదిరిగా స్పెషల్‌డ్రైవ్‌ లాగా దీన్ని నిర్వహించి ఆపై చేతులెత్తేసి తమకేమి తెలియదంటే ఇకపై కుదరదు. గ్రామ పరిస్థితుల పురోగతిపై అధ్యయనం చేస్తారు. దీనిపై ప్రభుత్వం ఫ్లయింగ్‌ స్కాడ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నది. తానే స్వయంగా పల్లెలకు వచ్చి పురోగతిని పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చెప్పడం ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో తెలియజేస్తున్నది. ఏ గ్రామ పురోగతి సరిగ్గా లేకున్న తగిన చర్యలుంటాయని సీఎం హెచ్చరించిన విషయం  తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం పెరిగి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అలాగే గ్రామాలను బాగు చేసుకున్న వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని ప్రకటించారు. దీని ద్వారా అంకితభావంతో పనిచేసే అధికారులను ప్రోత్సహించడంతో పాటు ఇతరుల్లో కూడా ఇది స్ఫూర్తి నింపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

పచ్చని గ్రామాలు.. ఆదర్శ పల్లెలు .. ఇదే కేసీఆర్‌ సంకల్పం. 

గ్రామల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం లక్ష్యంగా ఇప్పటి వరకు రెండు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. దీనిపై సీఎం కేసీఆర్‌ సైతం అధికారుల పనితీరును మెచ్చుకున్నారు. ఇది నిరంతరం కొనసాగాలని ..  పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచాలని,  వాటిని సంరక్షించాలని,  గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలని కేసీఆర్‌ సంకల్పించారు. ఆయన సంకల్పం మేరకే ఓ యజ్ఞంలా మళ్లీ పంచాయతీరాజ్‌ సమ్మేళనాలతో గ్రామాల బాట పట్టేందుకు  జిల్లా యంత్రాంగం సిద్ధమయ్యింది.   మురికి కుంటలు, చెత్తా చెదారం తొలగించడంతో పాటు  పాడుపడిన బావులను, పాత బోరుబావులను పూడ్చివేయడం..   ప్రతీ గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకోవడం చేయాలి. ఇప్పటి వరకు ట్రాక్టర్లు రాని గ్రామాలు వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి.  విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇవ్వడంతో ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం పెరిగింది. ఇకపై  గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల కాన్ఫరెన్సులో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అలర్టయ్యింది.  ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చేలా పనిచేయించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లకు సహాయకారిగా ఉండేందుకు అదనపు కలెక్టర్లను నియమించిన విషయం తెలిసిందే.  వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలను కేటాయించగా..  వారికి మరో పని అప్పగించవద్దని కూడా సీఎం ఆదేశించారు. ఒక అదనపు కలెక్టర్‌ కేవలం స్థానిక సంస్థలను సమర్ధవంతంగా పనిచేయించే బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలని సూచించారు. దీంతో ఇటు పాలన.. అటు పల్లె ప్రగతి రెండు పురోగతిలో పయనించనున్నాయి. logo