బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 19, 2020 , 02:18:37

అర్హులైన వారికి ‘ఉపాధి’ కల్పించాలి

అర్హులైన వారికి ‘ఉపాధి’ కల్పించాలి

నిజామాబాద్‌ రూరల్‌ : అర్హులైన కూలీలకు ఉపాధి హామీ కింద పనులు కల్పించాలని, వారికి రావాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించేలా చూడాల్సిన బాధ్యత ఈజీఎస్‌ సిబ్బందిపై ఉందని డీఆర్డీవో రమేశ్‌రాథోడ్‌ అన్నారు. రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఈజీఎస్‌ సామాజిక తనిఖీ రూరల్‌ మండల ప్రజావేదిక కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధిహామీ కింద వంద రోజుల పాటు పని కల్పించిన కుటుంబాలకు మళ్లీ అదే ఆర్థిక సంవత్సరం తిరిగి పనులు కల్పించకూడదని అన్నారు. 2018-2019 సంవత్సరంలో చాలా గ్రా మాల్లో వంద రోజుల పని చేసిన కుటుంబాలకు ఈజీఎస్‌ సిబ్బంది అదే ఆర్థిక సంవత్సరం మళ్లీ పనులు కల్పించడం తో వారికి బట్వాడా డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చెల్లిం చే అవకాశం లేకుండా ఉంటుందన్న విషయాన్ని ఉపాధిహామీ సిబ్బంది తెలుసుకోవాలన్నారు. ఉపాధి కూలీలు పనులు చేసినా సిబ్బంది మస్టర్లను సక్రమంగా నిర్వహించడం లేదని, సామాజిక తనిఖీ చేపట్టిన కార్యకర్తలు తమ నివేదికలో పేర్కొనట్లు ఆయన వివరించారు. ఉపాధి పనులను మండల స్థాయి అధికారులు, ఈజీఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఆవశ్యకతను గుర్తించాలన్నారు. 2018 సంవత్సరంలో 100 రోజుల పని కల్పించిన కుటుంబాలకు ఈజీఎస్‌ సిబ్బంది అవగాహన లేకపోవడంతో మళ్లీ పనులు కల్పించడం జరిగిందని ఈ నేపథ్యంలో బట్వాడా డబ్బులు అందలేదని కూలీలు గ్రామస్థాయిలో నిర్వహించిన ప్రజావేదికలో తెలిపినట్లు డీఆర్పీలు తమ నివేదికలో చదివి వినిపించారు. ఇందుకు డీఆర్డీవో స్పందిస్తూ వెంటనే బట్వాడా డబ్బులు చెల్లించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఈజీఎస్‌ అధికారులకు ఆదేశించా రు.  కూలీల మస్టర్లలో దిద్దుబాటు చర్యలకు పాల్పడకూడదన్నారు. ఇక ముందు అలా చేసిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో హెచ్చరించారు. ప్రజావేదిక కార్యక్రమంలో ఎంపీపీ బానోత్‌ అనూష, వైస్‌ ఎం పీపీ అన్నం సాయిలు, ఎంపీడీవో డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌, ఎస్‌ఆర్పీ రవి, గుండారం ఎంపీటీసీ అంకల గంగాధర్‌, మల్లారం సర్పంచ్‌ నగేశ్‌, మల్కాపూర్‌ తండా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ ప్రేమ్‌దాస్‌నాయక్‌, డీఆర్పీలు శ్రీనివాస్‌, యాదగిరి, సతీశ్‌, దినేశ్‌, హరిదాస్‌, పవన్‌, అనూష్‌కుమార్‌, శ్రావణ్‌కుమార్‌, టీఏలు ఉమేశ్‌కుమార్‌, హరీందర్‌, ప్రభాకర్‌రెడ్డి, సాయిప్రసాద్‌, ఈజీఎస్‌ సామాజిక తనిఖీ కార్యకర్తలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


logo