బుధవారం 27 మే 2020
Nizamabad - Feb 18, 2020 , 02:36:22

పసుపు రైతు కన్నీరు.. అర్వింద్‌కదే పన్నీరా..!

పసుపు రైతు కన్నీరు.. అర్వింద్‌కదే పన్నీరా..!

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా  ఎంపీ అర్వింద్‌ వైఖరి ఉందని పసుపు రైతులు మండిపడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మోసం చేసినా.. అంతకు మించి తెచ్చానంటూ స్పైసెస్‌బోర్డు ప్రాం తీయ కార్యాలయాన్ని చూపి పండుగ చేసుకోమన్నాడని వాపోతున్నారు. ఇక ఇంతకుమించి ఏదీ ఉండబోదని తానే డిక్లేర్‌ చేసేశాడని, మద్దతు ధరో రామచంద్రా.. అని  మొర పెట్టుకుంటుంటే.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్వింద్‌కు ఇప్పుడు బీజేపీ శ్రేణులు అభినందన సభ ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉం దని అంటున్నారు. కడుపుకాలి తాము కన్నీరు కారుస్తుం టే.. అర్వింద్‌ తమ కన్నీరునే పన్నీరుగా మార్చుకొని అభినందన సభలు పెట్టుకొని జేజేలు కొట్టించుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి తీరా ఏనాడో తిరస్కరించిన స్పైసెస్‌ బోర్డు కార్యాలయాన్ని తెచ్చి ఎంపీ అర్వింద్‌ తమను మోసం చేశాడని రైతులు  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో ఎంపీ అర్వింద్‌కు సన్మాన సభ నిర్వహించడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. ఒకపక్క చేతికి వచ్చిన పసుపునకు ధర లేక తీవ్ర ఆవేదనలో ఉన్న రైతులు ఈ వ్యవహారాన్ని నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా ఎంపీ అర్వింద్‌ వైఖరి ఉందని విమర్శిస్తున్నారు. అభినందన సభ తమ ఆశలకు కడుతున్న శాశ్వత సమాధిగా వారు పేర్కొంటున్నారు. ఇంతకు మించిన నమ్మకద్రోహం మరోటి ఉండబోదని భగ్గుమంటున్నారు. నమ్మించి నట్టేట ముంచిన అర్వింద్‌ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని వారు శాపనార్థ్ధాలు పెడుతున్నారు. 


నిలువునా మోసం.. ఆపై అభినందనతో పరిహాసం.. 

పసుపు రైతులను నిలువునా మోసం చేసిన అర్వింద్‌.. ఆపై వారిని పరిహాసమాడిన విధంగా అభినందన సభ పెట్టుకోవడంపై పుండుమీద కారం చల్లినట్లుందని, చెప్పిందొకటైతే.. చేసిందొకటని రైతులు మండిపడుతున్నారు. చెప్పింది గోరంతా.. చేసింది కొండంత అన్నట్లు ఎంపీ వైఖరి ఉంద ని, కానీ చెప్పింది కొండంత.. చేసింది గోరంత కూడా కాదని రైతులు దుయ్యబడుతున్నారు. ఐదు రోజుల్లో పసు పు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన అర్వింద్‌ అసలు పసుపు బోర్డే అవసరం లేదనే వాదనను తెరపైకి తేవడంతోనే తాము మోస పోయామని రైతులు అంటుచారు. సుగంధ ద్రవ్యాల బోర్డుకు సంబంధించిన కార్యాలయం ఒకటి వరంగల్‌లో ఉన్నట్లు నిజామాబాద్‌లో కూడా అలాంటి కార్యాలయం ఒకటి పెట్టించి చేతులు దులుపుకోవాలనే కుట్రలు జరుగుతున్నట్లు రైతులు బహిరంగంగానే విమర్శించారు. ఐదు రోజులు, నెల రోజులు అంటూ అర్వింద్‌ ఇచ్చిన హామీలతో ఈ సీజన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ ఆశలు అడియాశలు అయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్‌లో ధర లేక పరేషాన్‌లో ఉంటే అభినందన సభ పెట్టుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరో పోరాటానికి సిద్ధమవుతామని కదన రంగానికి వేదిక సిద్ధం చేసుకుంటున్న తరుణంలో అర్వింద్‌ వైఖరి వారిని మరింత రెచ్చగొట్టేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని రైతులు అంటున్నారు.  


‘ఆయన ఏం చేశాడని అభినందన సభ పెట్టుకున్నాడో.. పాపం రైతులను మోసం చేసి ఇప్పుడు తన అనుచరులతో డబ్బా కొట్టించుకుంటున్నాడు’ అంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారని, ఇది అర్వింద్‌ పనితనానికి అద్దం పడుతోందని అంటున్నారు. చెప్పింది చేయలేదు.. కాబట్టి అర్వింద్‌ రాజీనామా చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ బలపడుతున్న క్రమంలో అర్వింద్‌ దీన్ని పక్కదారి పట్టించేందుకు అభినందన సభ పెట్టుకున్నారని పలువురు విమర్శిస్తున్నా రు. ఈ నెల 13న జిల్లా కేంద్రంలో పసుపు రైతుల సమస్య ల పేరిట నిర్వహించిన సమావేశం పైనా పలువురు రైతుల నుంచి బహిరంగంగానే విమర్శలు వ్యక్తమయ్యాయని, తమకు మద్దతు ధర కావాలంటే మెళకువలు, రకాలు, ఎగుమతులు అంటూ కాలం గడుపుతున్నారని ఘాటుగా, సూటిగా విమర్శించారు. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు అంశాన్ని ఇంతలా రైతులు వ్యతిరేకిస్తుంటే, బోర్డు తేవడంలో విఫలమైన అరవింద్‌ రాజీనామా చేయాలని తాము డిమాండ్‌ చేస్తుంటే..అరవింద్‌కు అబినంధన సభ జరగడం పక్కాగా తమ ఆశలను సమాధి చేయడానికేననే రైతులు విమర్శిస్తున్నారు. రైతుల ముసుగులో బీజేపీ నాయకులతో ఇలాంటి కార్యక్రమాలు చేయించి పసుపు బోర్డుకు శాశ్వతంగా మంగళం పాడే పనిలో ఉన్నారని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

  logo