ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 18, 2020 , 02:28:25

పట్టణ ప్రగతిపై సీఎం సమావేశం నేడు

పట్టణ ప్రగతిపై సీఎం సమావేశం నేడు

ఇందూరు : పల్లెప్రగతి విజయవంతం కావడంతో పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో కలెక్టర్‌, మున్సిపల్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికతో అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. ఈ నెల 24 నుంచి నిర్వహించబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి వార్డు, డివిజన్‌కు ఒక సీనియర్‌ అధికారిని ఇన్‌చార్జిగా నియమించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా అధికారులతో కన్వర్జెన్స్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రా్రష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీల్లో, నగర పాలక సంస్థల్లో ప్రతివార్డు లేదా డివిజన్‌కు ఓ సీనియర్‌ అధికారిని నియమించి అతనికి ఆ వార్డుకు సంబంధించి అధికారులతో ఒక టీంను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్లు, తహసీల్దా ర్లు, ఏపీఎంలు.. ఆ స్థాయికి చెందిన అధికారులను నియమించాలని తెలిపారు. 


ప్రతివార్డు, డివిజన్‌కు యూత్‌, సీనియర్‌ సిటిజన్లను ప్రముఖ వ్యక్తుల, మహిళలతో నాలుగు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కమిటీల ఆధ్వర్యంలో అధికారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. పట్టణ ప్రగతి పూర్తయ్యే లోపే వాటికి అవసరమైన వాహనాలు సమకూర్చాలని, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డుల వివరాలు మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి నిర్వహించే సదస్సుకు అన్ని వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. ప్రజల కోసం టాయిలెట్స్‌, వాటి నిర్మాణాలకు కావాల్సిన స్థలం గుర్తింపు, మార్కెట్ల నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మొక్కలు నాటడం తదితర విషయాలను సమావేశానికి హాజరయ్యే మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతివార్డుకు కూడా గ్రీన్‌ యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన నర్సరీలను కూడా పట్టణాల్లో, గ్రామాల్లో అందుబాటును బట్టి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌ హిరామత్‌, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, బీఎస్‌ లత, ఆర్డీవోలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.logo