శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Feb 16, 2020 , 01:49:03

ఇరాక్‌ బాధితులకు కేటీఆర్‌ బాసట

ఇరాక్‌ బాధితులకు కేటీఆర్‌ బాసట
  • తెలంగాణకు చేరుకున్న గల్ఫ్‌ బాధితులు
  • మంత్రి కేటీఆర్‌కు బాధితుల కృతజ్ఞతలు

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ : ఇరాక్‌లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ బిడ్డలను సొంత ప్రాంతానికి రప్పించేందుకు మంత్రి కేటీఆర్‌ చూపిన చొరవ ఫలించింది. ఇరాక్‌లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, నకిలీ ఏజెంట్ల మోసంతో అక్కడ చిక్కుకొని కనీసం తాగేందుకు నీరు, తినేందుకు తిండి, వసతి సౌకర్యాలు లేక సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక నాలుగేండ్లుగా నరకయాతన అనుభవిస్తున్నామని బాధితులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌.. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ శాఖ అధికారులకు సమాచారం అందించి వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ మేరకు ఇరాక్‌లోని రాయబార కార్యాలయంతో భారత విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసిన తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ శాఖ, ఇరాక్‌లో చిక్కుకున్న వారికి విమాన టికెట్లు అందించి తెలంగాణకు రప్పించింది. 


ఇరాక్‌ నుంచి బయల్దేరిన వీరు శనివారం  ఉదయం హైదరాబాద్‌ చేరుకొన్నారు. దీంతో వీరిని వారి వారి ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన స్థానిక రవాణా సౌకర్యాలను కూడా తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ శాఖ సమకూర్చింది. తమ సమస్యలను తెలుసుకొని స్పందించి వెంటనే సహాయం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యం గా మంత్రి కేటీఆర్‌కు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బాధితులను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు ప్రత్యేకంగా వెళ్లి రిసీవ్‌ చేసుకొన్నారు. ఇరాక్‌ బాధితులకు ఏ విధమైన జరిమానా లేకుండా క్షేమంగా తీసుకొచ్చిన కేటీఆర్‌, ఎన్‌ఆర్‌ఐ సెల్‌ అధికారి చిట్టిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


logo