బుధవారం 27 మే 2020
Nizamabad - Feb 15, 2020 , 01:14:09

‘క్యాష్‌ఓన్లీ’ కష్టాలు

‘క్యాష్‌ఓన్లీ’ కష్టాలు

ఇందల్వాయి: స్థానిక టోల్‌ప్లాజాలోని 12 గేట్లలో 10 గేట్లను ఫాస్టాగ్‌కు అనుసంధానం చేయగా.. అటు, ఇటు ఒక్కో గేటును క్యాష్‌ఓన్లీగా మార్చారు. ఫాస్టాగ్‌ ట్యాగ్‌లు తీసుకోని వాహనాలకు ఒక్కోగేటు నుంచే రాకపోకలకు అనుమతి ఉండడంతో ‘క్యాష్‌ఓన్లీ’ కౌంటర్ల వద్ద వాహనాలు బారులుతీరుతున్నాయి. శుక్రవారం ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. 

ఫాస్టాగ్‌లు అతికించుకోని వాహనదారులకు టోల్‌ప్లాజా వద్ద నిత్యం కష్టాలు తప్పడం లేదు. నిత్యం కిలోమీటరు వరకు వాహనాలు క్యాష్‌ఓన్లీ గేటు వద్ద బారులు తీరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఫాస్టాగ్‌ సేవలను జనవరి 15 నుంచి అమలు చేస్తున్నది. ఫాస్టాగ్‌లున్న వాహనాలు రెండు సెకన్లలో టోల్‌ప్లాజాలను దాటి వెళ్తున్నాయి. ఫాస్టాగ్‌లు లేని వాహనాలు దాదాపు ఇందల్వాయి టోల్‌ప్లాజా నుంచి గన్నారం గ్రామ స్వాగత తోరణం వరకు ఇటు ఇందల్వాయి మండల కేంద్రం వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహనదారులు సమయానికి గమ్యస్థానాలకు వెళ్లలేక క్యాష్‌లైన్‌లోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. గన్నారం స్వాగత తోరణానికి అడ్డంగా టోల్‌ప్లాజా నగదు చెల్లింపు వాహనాలు నిలిచి ఉంటున్నాయి. గన్నారం స్వాగత నుంచి వచ్చే నల్లవెల్లి, సిర్నాపల్లి, మెగ్యానాయక్‌ తండాల వాహనదారులు రోడ్డుపైకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గన్నారం స్వాగత తోరణం వద్ద కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తిర్మన్‌పల్లి వద్ద ఉన్న యూటర్న్‌ను దాటి వాహనాలు నిలిచి ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

స్పందించని అధికారులు

ఇందల్లాయి టోల్‌ప్లాజా వద్దకు బుధవారం ఎన్‌హెచ్‌ఏఐ పీడీ తరుణ్‌, అధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే వెనుదిరిగిపోయారు. కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఫాస్టాగ్‌ వ్యవస్థను అమలు చేస్తున్నది. దీనిపై అవగాహన లేక వాహనదారులు తమ వాహనాలఫాస్టాగ్‌లను అమర్చుకోవడం లేదు. 


logo