శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 15, 2020 , 01:10:24

ఇంటర్‌ పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

ఇంటర్‌ పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

బోధన్‌, నమస్తే తెలంగాణ: బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ మధుమలంచ జూనియర్‌ కళాశాలల్లో వచ్చే నెల 4 నుంచి జరుగనున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షల కోసం ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలను శనివారం బోధన్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీవో) గోపీరాం పరిశీలించారు. ప్రభుత్వ మధుమలంచ జూనియర్‌ కళాశాల ఇంటర్మీడియెట్‌ పరీక్షా కేంద్రంలో గదులు అపరిశుభ్రంగా ఉండడం, సరైన వెంటిలేషన్‌ లేకపోవటంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. గదుల్లో కరెంట్‌ సౌకర్యం లేకపోవడం, ఫ్యాన్లు లేకపోవడంతో పాటు గోడలన్నీ శుభ్రంగా లేకపోవడంతో విస్మయం వ్యక్తంచేశారు. వెంటనే కరెంట్‌ సౌకర్యం కల్పించాలని, కొన్ని గదుల గోడలకు అవసరమైతే సున్నం వేయాలని, వెంటిలేషన్‌ ఏర్పాటు చేయాలని ఆ కళాశాల బాధ్యులను ఆదేశించారు. ఈ సౌకర్యాలన్నీ కల్పించి, ఆ ఫొటోలను తనకు వెంటనే వాట్సప్‌ చేయాలని సూచించారు. విద్యార్థులకు పరీక్షలు రాసే వాతావరణం లేకపోతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని ఆయన స్పష్టంచేశారు. అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆర్డీవో సందర్శించారు. ఇంటర్మీడియెట్‌ పరీక్షల ఏర్పాట్లపై ప్రిన్సిపాల్‌ గురువారెడ్డితో మాట్లాడారు. పరీక్షలు రాసే విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చేయాలని, టాయిలెట్స్‌ శుభ్రంగా ఉంచాలని చెప్పారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం 38 అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయా లేదా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవటానికి బోధన్‌ పట్టణంలోని ఎనిమిది ఇంటర్మీయెట్‌ కేంద్రాలను, మండల కేంద్రాల్లోని మరో మూడు ఇంటర్మీడియట్‌ పరీక్షలను తనిఖీచేయనున్నట్లు ఆర్డీవో ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. 


logo