శనివారం 30 మే 2020
Nizamabad - Feb 14, 2020 , 03:52:59

ప్రశ్నల వర్షం..

ప్రశ్నల వర్షం..

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లా పరిషత్‌ విభజన తర్వాత జరిగిన రెండో సర్వసభ్య సమావేశంలో అధికారులే టార్గెట్‌గా సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. శాఖల వారీగా జరిగిన చర్చలో సంబంధిత అధికారుల పనితీరుపై సభ్యులు అస్త్రశస్త్రాలు సంధించారు. ఆరు గంటల పాటు కీలకమైన శాఖలపై లోతైన చర్చ జరిగింది. చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, జడ్పీ సీఈవో గోవింద్‌ పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌, మార్క్‌ఫెడ్‌, హెల్త్‌, పంచాయతీరాజ్‌, ట్రాన్స్‌ కో, ఆర్‌అండ్‌బీ, పౌర సరఫరాల సంస్థ, ఆర్టీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై అర్థవంతమైన చర్చ జరిగింది. సభ్యులు సంధించిన ప్రశ్నలకు కొంత మంది అధికారులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్‌, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ సమావేశాన్ని సమన్వయం చేశారు. సభ్యుల ప్రశ్నలకు సవివరంగా సమాధానమిచ్చారు. కొన్ని శాఖలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఇదే వేదికగా ఆదేశాలు జారీ చేశారు. మిషన్‌ భగీరథ పథకం అంతా మంచిగా జరుగుతున్నా అధికారుల లోపాలతో అక్కడక్కడ చిన్నచిన్న అవాంతరాలు వస్తున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రాజేందర్‌ సరైన వివరణ ఇవ్వకపోగా.. సభ్యుల ప్రశ్నలకు సరిగ్గా స్పందించపోవడంతో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో వెంటనే ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ కల్పించుకొని ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరిస్తూ.. అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మిషన్‌ భగీరథ పథకం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమలవుతున్నదని, దీని ద్వారా ప్రజలకు సురక్షితమైన నీరు అందుతున్నదన్నారు. ఇంత మంచి పథకం.. చిన్న చిన్న కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రావొద్దని వీజీ గౌడ్‌ అధికారులకు చురకలంటించారు. పౌర సరఫరాల సంస్థలో గతంలో గోనె సంచులు కాలిపోయిన ఉదంతాన్ని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చి పలు ఆరోపణలు చేశారు. దీనిపై కలెక్టర్‌ వెంటనే విచారణకు ఆదేశించారు. డీఈవో జనార్దన్‌రావు అన్ని మండలాలను, గ్రామాల్లోని పాఠశాలలను సందర్శించడం లేదని పలువురు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇలా శాఖల వారీగా అధికారుల వైఫల్యాలను ఎత్తిచూపే విషయంలో సభ్యులు పోటీ పడ్డారు. చైర్మన్‌, కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అధికారుల నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో .. కలెక్టర్‌ జోక్యం చేసుకొని సభ్యుల అనుమానాలను నివృత్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. ఆరోపణలపై విచారణ చేపడతామని తెలిపారు. ఎమ్మెల్సీ గంగాధర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఉపాధి హామీ ద్వారా పనులు చేయించి కూలీలకు పని కల్పించడంతో పాటు సకాలంలో కూలీపైకం వచ్చేలా చూడాలన్నారు. ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం లేనందున రైతులు రోడ్లపైన ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారని, స్థలాలు ఉన్నచోట ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాల్లో బెల్టు షాపులతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఇందల్వాయి జడ్పీటీసీ కోరారు. దీంతో ఆరుగంటల పాటు జడ్పీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. కీలక శాఖలపై లోతైన చర్చ జరిగింది. 

సమగ్రమైన పరిపాలనే లక్ష్యం : కలెక్టర్‌ నారాయణరెడ్డి

వచ్చే నాలుగేండ్లు అందరి లక్ష్యం సమగ్రమైన పరిపాలన వైపు ఉండాలని, పేదలందరికీ పథకాలు దరిచేరేలా పనిచేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా 530 గ్రామ పంచాయతీలలో శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డుల పనులు జరుగుతున్నాయని, 97 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులకు అటవీ భూమిని కేటాయించామన్నారు. ఈ నెలాఖరు వరకు శ్మశానవాటికలు పూర్తి చేయిస్తామన్నారు. నవీపేట మండలం మహాంతం గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించకుండానే రూ.1.60 లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఎంపీపీ ఫిర్యాదు చేయగా.. ఎంపీడీవోతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విద్యాశాఖ, సంక్షేమ శాఖలు, ఆర్టీసీపై చర్చ జరిగింది. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ.. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పంచాయతీరాజ్‌ చట్టంతో పాటు త్వరలో పట్టణ చట్టాన్ని కూడా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగా గురు, శుక్రవారాల్లో అదనపు కలెక్టర్లకు, శుక్రవారం నాడు కలెక్టర్లకు ఎంసీహెచ్‌ఆర్‌డీలో శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో గ్రామాలు, పట్టణాలు ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో గోవింద్‌, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు. 


logo