ఆదివారం 24 మే 2020
Nizamabad - Feb 14, 2020 , 03:47:40

16నగోదావరి యాత్ర

16నగోదావరి యాత్ర

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: ఈనెల 16వ తేదీ నుంచి 19 వరకు నిర్వహించే గోదావరి జలయాత్రను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగడించిన డాక్టర్‌ రాజేందర్‌ సింగ్‌ తన బృందం సభ్యులతో కలిసి గోదావరి జలయాత్రలో పాల్గొని అందరిలో స్ఫూర్తిని నింపనున్నారని తెలిపారు. దేశంలోని ప్రధానమైన ఏడు నదులను జల ప్రక్షాళనగావించడమేకాక రాజస్థాన్‌ లాంటి ప్రదేశాల్లో కూడా నదుల్లో నీటి నిల్వ, పెంపుదలకు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వారి మార్గనిర్దేశంలో గోదావరి జల సమృద్ధి, నీటి వినియోగం తదితర విషయాలను అవగాహన చేసుకొని ముందుకు వెళ్లడానికి ఈ జలయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16వ తేదీన ప్రారంభంకానున్న ఈ గోదావరి జలయాత్ర ఉదయం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును సందర్శించి తెలంగాణ నీటివనరుల అభివృద్ధి సంస్థ అతిథులతో సమావేశం, ఉదయం 10 గంటలకు ఆర్మూర్‌ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి గోదావరి నీటివనరుల సద్వినియోగంపై మాట్లాడుతారని అన్నారు. రైతులు వివిధ కాలాల్లో నీటిని ఏ విధంగా వాడుకోవాలో తెలియచేస్తామని, నీటివనరుల వినియోగంలో రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకొని వాటిని తీర్చడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో జలయాత్ర అవగాహన సదస్సు, జలసాక్షరతాః జలహక్కులు-బాధ్యతలు అనే అంశంపై వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేందర్‌సింగ్‌ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఉంటుందని తెలిపారు. జలసాక్షరతా కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, రైతులు, సామాజిక వేత్తలు, మేధావులు, విద్యావంతులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, ప్రజానాయకులు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా చేరుతారని అన్నారు. మన రాష్ట్రంలో నీటి వనరులు అధికంగా ఉన్నాయని కానీ వాటి వినియోగంలో శ్రద్ధవహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నీటివనరుల మీద అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం మాట్లాడుతూ గోదావరి జలచైతన్య యాత్రలో తెలంగాణ విశ్వవిద్యాలయం భాగం పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య పి.కనకయ్య, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణాబాయి, చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ జమీల్‌, పబ్లికేషన్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌ ప్రభంజన్‌యాదవ్‌, డాక్టర్‌ అక్కినపల్లి పున్నయ్య, డాక్టర్‌ వి.త్రివేణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. logo