శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 13, 2020 , 00:51:01

సమ్మేళనానికి సన్నాహలు

సమ్మేళనానికి సన్నాహలు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : క్షేత్రస్థాయిలో గ్రామాలను బలోపేతం చేసేందుకు కొత్తగా పంచాయతీరాజ్‌ చట్టాన్ని ప్రభు త్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమ లు చేసే క్రమంలో స్థానిక సంస్థల ప్రతినిధుల బాధ్యతలు, కర్తవ్యం గురించి సవివరంగా తెలియజేసి పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వారిని కార్మోన్ముఖులను చేసే క్రమంలో ప్రభుత్వం త్వరలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం పేరుతో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ సమావేశాలకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఓ ఉత్తర్వులో పేర్కొంది. మంత్రితో పాటు జడ్పీచైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల విధులను విడమరిచి వివరించడంతో పాటు పల్లెలను అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి పథంలో నడిపేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధులపై మంత్రి వివరిస్తారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్వహించే పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సమావేశం తర్వాత పది రోజుల గడువిచ్చి గ్రామ పరిస్థితుల పురోగతిపై అధ్యయనం చేస్తారు. దీనిపై ప్రభుత్వం ఫ్లయింగ్‌ స్కాడ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నది. తానే స్వయంగా పల్లెలకు వచ్చి పురోగతిని పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఏ గ్రామ పురోగతి సరిగ్గా లేకున్నా తగిన చర్యలుంటాయని సీఎం హెచ్చరించిన విషయం తెలిసిందే. గ్రామాలను బాగు చేసుకున్న వారికి అవార్డులు, ప్రోత్సహకాలు కూడా ఉంటాయని ప్రకటించారు. మరో పది రోజుల్లో పంచాయతీ రాజ్‌ సమ్మేళనం సమావేశం నిర్వహించుకొనే అవకాశం ఉంది. త్వరలో ఈ తేదీపై స్పష్టత రానున్నది. 


logo