శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 13, 2020 , 00:49:13

అధికారులు అప్రమత్తం

అధికారులు అప్రమత్తం

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : అధికారులు అప్రమత్తమయ్యారు. జడ్పీ విభజన తర్వాత రెండు నెలల క్రితం జరిగిన తొలి సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారుల తీరుపై, అలసత్వ ధోరణిపై ఫైర్‌ అయ్యారు. క్షేత్రస్థాయిలో పురోగతి ఒకలా ఉంటే.. కాగితాల్లో అధికారుల గణాంకాలు మరోలా ఉన్నాయి. నిండు సమావేశం సాక్షిగా డీఆర్డీవో, డీపీవో శాఖల ఉదాసీనవైఖరి, నిర్లక్ష్యం బట్టబయలైంది. దీనిపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు చురకలంటించారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. మళ్లీ గురువారం రెండో సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు జడ్పీహాల్‌లో చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశం చేసిన తరుణంలోనే జడ్పీ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. సీఎం చెప్పిన కీలక అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. డీఆర్డీవో, డీపీవో శాఖలపై లోతుగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తున్నది. పల్లెప్రగతిలో భాగంగా ఇప్పటి వరకు చేసిన పనులు, మిగిలిపోయిన అభివృద్ధి, హరితహారం, శ్మశాన వాటికల నిర్మా ణం, డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, ట్రాక్టర్ల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలు ప్రధానంగా సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ రెండు శాఖల అధికారు లు తొలి సమావేశంలో సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఈ సమావేశానికి మాత్రం సమగ్ర సమాచారంతో అధికారులు హాజరవుతున్నారు. అనంత రం కీలకశాఖలనే ఎజెండాగా తీసుకొని మీటింగ్‌లో చర్చించనున్నారు. 

వ్యవసాయం, ఆర్‌డబ్ల్యూఎస్‌, మిషన్‌ భగీరథ తదితర ప్రాధాన్యత కలిగిన శాఖలను తొలుత ఎజెండాగా తీసుకొని విపులంగా చర్చించనున్నారు. అనంతరం మిగిలిన శాఖలపై సమావేశంలో చర్చ జరగనుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే సమావేశానికి ఎం పీపీలు, జడ్పీటీసీలు, కో ఆప్షన్‌ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారు. 


logo