శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 13, 2020 , 00:47:20

సామాన్యులపై గ్యాస్‌బండ

సామాన్యులపై గ్యాస్‌బండ

ఖలీల్‌వాడి : ఎన్డీయే సర్కారు పేదలపై మోయలేని భారాన్ని మోపుతున్నది. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నది. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ప్రభుత్వం ఎడాపెడా ధరలను పెంచి పేదలకు సమస్యలను తెచ్చి పెడుతున్నది. 2014 సంవత్సరం నుంచి గడిచిన ఆరేండ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా వంట గ్యాస్‌ ధరలను పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా సిలిండర్‌ ధరలు రూ.145 పెంపుతో రూ.714 ఉన్న ఒక్క ఎల్పీజీ సిలిండర్‌ ధర అమాంతం రూ.858కు చేరింది. ఎల్పీజీ ధరల పెంపుతో సామాన్యులపై రూ.కోట్లలో భారం పడనుంది. 

పేదలపై మరింత భారం..

పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెను ప్రభావం చూపే వంటగ్యాస్‌ ధరలను చీటికి మాటికి పెంచడంతో కేంద్ర సర్కారు తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న జనాలకు ఏకంగా రూ.145 పెంచడం మరింత కుంగదీస్తోంది. ఈ క్రమంలో తిరిగి పాత పద్ధతు ల్లో పొయ్యి రాజేసుకొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కట్టెల పొయ్యిపై వంట చేస్తే వచ్చే పొగతో కంటి సంబంధి త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వంట చెరుకు కోసం చెట్ల నరికివేత కారణంగా అడవులు అంతరించి ప్రాణకోటి మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొ ని గత ప్రభుత్వాలు వంట గ్యాస్‌ వినియోగాన్ని పెంచే అంశానికి ప్రాధాన్యం ఇచ్చాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు, మహిళా సంఘాల్లోని సభ్యులకు రాయితీపై కనెక్షన్లు ఇచ్చే పథకాన్ని సైతం అమలు చేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం సిలిండర్ల రీఫిల్లింగ్‌ కు ఇస్తోన్న రాయితీని తగ్గించడం, ఎల్పీజీ ధరలను పెంచ డం మూలంగా సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇప్పటికే రాయితీకి మంగళం..

ఇప్పటికే వంట గ్యాస్‌పై రాయితీని క్రమంగా ఎత్తివేతకు శ్రీకారం చుట్టిన ఎన్డీయే సర్కారు ప్రస్తుతం ప్రతి సిలిండర్‌కు కేవలం రూ.178 మాత్రమే సబ్సిడీ అందిస్తున్నది. వంటగ్యాస్‌ సిలిండర్లపై రాయితీకి భారీగా మంగళం పాడి న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు.. ఎడెపెడా వంట గ్యాస్‌ ధరలను పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడం పేదలను ఇబ్బందులకు గురి చేస్తోంది. పెట్రోల్‌పైనా, డీజిల్‌ పైనా ధరల నియంత్రణ వ్యవస్థను ఎత్తేసినట్లే వంటగ్యాస్‌పై కూడా తొలగించడంతో ధరల మార్పులు ఇష్టానుసారంగా తయారైంది. 

ప్రతి సిలిండర్‌పై రూ.145 పెంపు..

వంట గ్యాస్‌ ధర ఒకేసారి రూ.145 పెరిగింది. ఫలితంగా రూ.714 ఉన్న ఒక్క ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర అమాంతం రూ.858కు చేరింది. ప్రభుత్వం వినియోగ దారులకు ఇచ్చే రాయితీ మొత్తం 153.86 నుంచి రూ. 291.48 పెరిగింది.  2014 జనవరి తర్వాత వంట గ్యాస్‌ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల మార్పే తాజా పరిస్థితికి  కారణమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరమే దేశ ప్రజలపై మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం ఆలోచింపజేస్తున్నది. గడిచిన ఐదు నెలల్లో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచడం వరుసగా ఇది ఆరోసారి కావడం విశేషం. 


logo