సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Feb 12, 2020 , 04:13:26

గుర్తులొచ్చాయి!

 గుర్తులొచ్చాయి!

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: సహకార ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. ఇక ప్రచారం షురూ అయ్యింది. ఈనెల 15న పోలింగ్‌ ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రైతులంతా టీఆర్‌ఎస్‌ వైపేనని ఇప్పటికే రూఢీ అయ్యింది. జిల్లాలోని మొత్తం 89 సొసైటీల్లో 54 సొసైటీలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. ఇది శుభారంభంగా భావిస్తున్నాయి టీఆర్‌ఎస్‌ శ్రేణులు. ఇదే దూకుడుతో మిగిలిన సొసైటీల చైర్మన్లను దక్కించుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారానికి మరో రెండు రోజులే సమయం ఉంది. దీంతో ఎవరికి వారే రైతుల మద్దతు కూడగట్టేందుకు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1147 డైరెక్టర్‌ స్థానాలకు గాను 736 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవన్నీ టీఆర్‌ఎస్‌కే దక్కాయి. దీంతో మిగిలిన 411 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో మొత్తం 996 మంది పోటీ పడుతున్నారు. పోలింగ్‌ కోసం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సహకార ఎన్నికల కోసం ప్రిసైడింగ్‌ అధికారులకు మాత్రమే శిక్షణ కార్యక్రమం ఉంటుందని, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు 14న నేరుగా డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు రావాలని జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం కోరారు. నేడు ఉదయం 10 గంటలకు నిజామాబాద్‌ డివిజన్‌కు చెందిన ప్రిసైడింగ్‌ అధికారులకు జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం ఉంటుందని, ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని అధికారులకు ఆర్మూర్‌లోని మార్కెట్‌యార్డులో, బోధన్‌ డివిజన్‌కు సంబంధించి అక్కడి ఉర్దూఘర్‌లో శిక్షణనిస్తున్నామని తెలిపారు. అన్ని ఏర్పాట్లు చేశామని, శిక్షణ కార్యక్రమానికి సమయానికి రావాలని కోరారు. కాగా, ఇప్పటికే  ఎన్నికల గుర్తులు కేటాయించారు. బ్యాలెట్‌ పత్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్‌ పత్రాల్లో వరుసగా.. బీరువా, బ్యాట్‌, బ్యాటరీ టార్చ్‌, బ్రష్‌ గుర్తులను కేటాయించారు. ఒక్కో డైరెక్టర్‌ స్థానానికి నలుగురు, ఆ లోపే అభ్యర్థులు పోటీ పడుతుండడంతో ఈ నాలుగు గుర్తులు కేటాయించారు. 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభిస్తారు. వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను నిర్వహిస్తారు. ఒకే నామినేషన్‌ వస్తే .. వాటిని ఏకగ్రీవంగా ప్రకటించేస్తారు. మిగిలిన వాటిల్లో బ్యాలెట్‌ ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. logo