ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 12, 2020 , 04:09:44

కలెక్టరే సుప్రీమ్‌..!

కలెక్టరే సుప్రీమ్‌..!

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: కలెక్టర్లకు కొత్త బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. మొన్నటి వరకు ఉన్న పని ఒత్తిడిని, భారాన్ని తగ్గిస్తూనే అదనపు బాధ్యతలను పెట్టింది. జిల్లాకు ఇద్దరు అడిషనల్‌ కలెక్టర్లను నియమించి కలెక్టర్‌కు భారం తగ్గించింది. అదే సమయంలో కీలక విషయాల్లో కలెక్టర్‌కు ప్రత్యేకాధికారాలను కట్టబెట్టింది. జిల్లా సమగ్రాభివృద్ధికి కలెక్టర్‌ను సుప్రీమ్‌గా చేసిన సర్కారు.. కీలకమైన కొత్త చట్టాల అమలు వారి భుజస్కంధాలపై మోపింది. పల్లెలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. పల్లె ప్రగతి ఓ స్పెషల్‌ డ్రైవ్‌లా కాకుండా.. నిరంతర కార్యక్రమంలా చేపట్టాలని ఆదేశించారు సీఎం కేసీఆర్‌. ఇక జిల్లాలో ఆదర్శపల్లెలు కావాలని, ఆ దిశగా జిల్లా యంత్రాంగం సమష్టిగా కృషిచేయాలని ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు నిరంతరంగా కొనసాగిన ఈ సమావేశంలో.. కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టాల అమలుపై సుధీర్ఘంగా మాట్లాడిన సీఎం.. కొత్తగా ప్రవేశపెట్టబోయే రెవె న్యూ చట్టం రూపకల్పనకు సంబంధించి కలెక్టర్ల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. 

అందరి ప్రాధామ్యాలు ఒకటే కావాలి.. 

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లకు ఉద్భోదించారు. విస్తృత మేథోమధనం, అనేక రకాల చర్చోప చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ - విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని, కార్యక్రమాలు తీసుకుంటుందని సీఎం సూచించారు. కలెక్టర్లు ఎవరి ప్రాధామ్యాలు వారు ఎంచుకోవద్దు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలని సూచించారు. ఒక టీమ్‌లాగా అధికార యంత్రాంగం పనిచేయాలని, రాష్ట్రస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలని ఉద్భోద చేశారు.  కేసీఆర్‌ కిట్స్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చిన పథకాలని, ఎంతో మేథోమధనం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాస్తవిక దృకృథంతో ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు. కలెక్టర్ల వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాలని నిర్ణయించిందన్నారు. అందుకే కలెక్టర్లకు అండగా ఉండడం కోసం అడిషనల్‌ కలెక్టర్లను ప్రభుత్వం నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలని, కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం ఉంచిందన్నారు. అదే సందర్భంలో కలెక్టర్లకు ఎంతో బాధ్యత ఉందని, గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్‌గా వ్యవహరించేవారని, ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చామన్నారు. దీంతో కొంత పని ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.  

పచ్చని గ్రామాలు.. ఆదర్శ పల్లెలు కావాలి.. 

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం లక్ష్యంగా ఇప్పటి వరకు రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలన్నారు. పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచాలని,  వాటిని సంరక్షించాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలని,  మురికి గుంటలు, చెత్తాచెదారం తొలగించాలని, పాడుపడిన బావులు పూడ్చివేయాలని, పాత బోరుబావులను పూడ్చాలని సూచించారు. ఈ పనులు అన్నింటినీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు చేయించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదని, కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా విభాగాలు చిన్నవి అయ్యాయన్నారు. ఇది పల్లెలను బాగు చేసుకోవడానికి ఎంతో సానుకూల అంశమని, పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య కాకుండా, ప్రతినెలా రూ. 339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.  ప్రతి గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పించామని,  విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామన్నారు. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశామని, ప్రభుత్వం తన అధికారాలను వదులుకుని కలెక్టర్ల పై నమ్మకంతో వారికి బదిలీ చేసిందన్నారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని, ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.  ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలన్నారు. కలెక్టర్లకు సహాయకారిగా ఉండేందుకు అడిషనల్‌ కలెక్టర్లను నియమించామన్నారు. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలను కేటాయించామని, వారికి మరో పని అప్పగించవద్దన్నారు. ఒక అడిషనల్‌ కలెక్టర్‌ కేవలం స్థానిక సంస్థలను సమర్ధవంతంగా పనిచేయించే బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలని సూచించారు. రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీ రాజ్‌ సమ్మేళనం’ నిర్వహించాలని , సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను ఆహ్వానించాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకునే పద్ధతి వివరించాలన్నారు. ఎవరి బాధ్యత ఏమిటో విడమరిచి చెప్పాలని,  సర్పంచులు, కార్యదర్శులు ఏమేం చేయాలో వివరించాలని, దీనికి  మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్లను ముఖ్య అతిథులుగా పిలవాలన్నారు. ‘ ఈ సమ్మేళనంలో విధులు, బాధ్యతలు చెప్పాలి.. సమావేశం తర్వాత పది రోజుల గడువు ఇవ్వాలి.. ఆలోగా గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలి. మొత్తం 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ప్లయింగ్‌ స్కాడ్‌లు పర్యటిస్తాయి. ముఖ్యమంత్రిగా నేను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తాను. ఏ గ్రామం  అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా ఉంటా యి..” అని వివరించారు.  

అన్ని అంశాలపై లోతుగా చర్చ.. 

- పల్లె ప్రగతి కార్యక్రమం కొద్ది కాలం చేసి ఊరుకునే కార్యక్రమం కాదు. కేవలం స్పెషల్‌ డ్రైవ్‌గా కాదు, ఇది నిరంతరం సాగాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. దేశంలో ఆదర్శ పల్లెలు ఎక్కడున్నాయంటే, తెలంగాణలో ఉన్నాయనే పేరు రావాలని సూచించారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పనులు చేయడానికి ప్రతీ కలెక్టర్‌ వద్ద ఒక్కో  కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచుతామన్నారు.  మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యతన్నారు. వారి పనితీరుకు ఇదే గీటురాయని, మొక్కలు నాటి , సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే సమస్యే లేదన్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు.  పట్టణాలు, నగరాలకు రూ. 70 కోట్ల చొప్పున విడుదల చేస్తామన్నారు. ఈ నిధులతో పాటు, స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నప్పటికీ, అక్షరాస్యత విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నామని,  తెలంగాణ రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిన తీసుకోవాలన్నారు. తమ గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలని, తమ జిల్లాను పూర్తి అక్షరాస్యత సాధించే   బాధ్య త కలెక్టర్లు తీసుకోవాలని సీఎం సూచించారు. 


రెండో కలెక్టర్ల సదస్సు...

తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న రెండో కలెక్టర్ల సదస్సు ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న పంచాయతీ రాజ్‌, పురపాలక చట్టాలతో పాటుగా కొత్తగా తీసుకు రాబోతున్న రెవెన్యూ చట్టంపైనా సదస్సులో విస్తృతంగా చర్చించడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, వచ్చే వానాకాలం కార్యాచరణ, పౌరులకు హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీ, ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన వంటి కీలకమైన అంశాలపై సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కీలకమైన ఎన్నికలన్నీ ముగియడంతో కేసీఆర్‌ పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి సారించారు. పలు సంస్కరణలు చేపట్టారు. జిల్లలాకు కొత్త కలెక్టర్ల నియామకం, జిల్లాల్లో సంయుక్త కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల కోసం ప్రత్యేకంగా అదనపు కలెక్టర్‌ నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు కొత్త పాలన పంథాను సీఎం సమగ్రంగా వివరించినట్లు సమాచారం. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండేలా, వాటిని సమర్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని సీఎం స్పష్టం చేశారు. పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత వెల్లివిరిసేలా, కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కలెక్టర్లకు అండగా  అదనపు కలెక్టర్లను నియామకంపై సీఎం వివరించినట్లు సమాచారం.


logo