మంగళవారం 26 మే 2020
Nizamabad - Feb 12, 2020 , 03:56:21

నవీపేటలో ప్రసూతి ఆపరేషన్లు

నవీపేటలో ప్రసూతి ఆపరేషన్లు

నవీపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో త్వరలో ప్రసూతి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను పునఃప్రారంభిస్తామని జిల్లా వైద్యాధికారి సుదర్శన్‌ తెలిపారు. మంగళవారం సీఎచ్‌సీ  అభివృద్ధి కమిటీ సమావేశం ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి డీఎంఎచ్‌వో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్త్రీ వైద్య నిపుణులు, అనస్తీషియా డాక్టర్‌ లేక పోవడంతో గత కొన్ని రోజుల నుంచి ఆపరేషన్లను తాత్కలికంగా నిలిపివేశామని, వారంలోగా యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. అవసరమైన వైద్యులను నియమించి వారంలో ఒకసారి ఆపరేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నందిపేట, మాక్లూర్‌, ఎడపల్లి, రెంజల్‌ దవాఖానల పరిధిలో ప్రజలు ఇక్కడే ఆపరేషన్లు చేసుకునేలా ఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరారు.  దవాఖానలో సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు వచ్చాయని, దీనిని సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు హెచ్చరించారు. దవాఖాన అభివృద్ధికి విడుదలయ్యే నిధులను దుర్వినియోగం చేయొద్దన్నారు. దవాఖాన స్థలం కబ్జాకు గురైనట్లు తన దృష్టికి వచ్చిందని, తిరిగి స్వాధీనం చేసుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. పాత దవాఖాన స్థలాన్ని సైతం కొంతమంది అక్రమించుకుంటున్నారని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోగులకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించేలా  చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌ అన్నారు. సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంఎచ్‌వో తుకారం, జడ్పీటీసీ సవిత, సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీలు రాధ, మీన, దవాఖాన పర్యవేక్షకుడు దేవేందర్‌, వైద్యులు అజయ్‌కుమార్‌, తరునామ్‌ నాజ్‌, దంత వైద్యురాలు శ్వేత, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. 


logo