బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 11, 2020 , 02:07:05

సంస్కరణల పాలన

సంస్కరణల పాలన

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: పాలనలో సంస్కరణలకు సర్కారు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ కొత్త చట్టానికి మోక్షం లభించనున్న నేపథ్యంలోనే జిల్లాలో పాలనాపరమైన మార్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆదివారం రాత్రి ఈ మేరకు ప్రభుత్వం పలువురిని బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ పోస్టును రద్దు చేసింది. కలెక్టర్‌ హోదాను కూడా పాలనాధికారిగా మార్చాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనలు ఒక్కొక్కటిగా పురుడు పోసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చేపట్టిన బదిలీల్లో ప్రభుత్వ మార్కు సంస్కరణల పర్వం సంకేతాలు కనిపించాయి. జేసీ పోస్టును తీసేసి అడిషనల్‌ కలెక్టర్‌ హోదాను ప్రభుత్వం కల్పిస్తూ ఆ మేరకు పోస్టింగులు ఇచ్చింది. ఇక్కడ జేసీగా చేసిన ఎం.వెంకటేశ్వర్లును మహబూబాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా బదిలీ చేసింది. డీఆర్వో అంజయ్యను రాజన్న సిరిసిల్ల జిల్ల అడిషనల్‌ కలెక్టర్‌గా పంపింది. ఇక్కడికి అడిషనల్‌ కలెక్టర్‌గా బి.చంద్రశేఖర్‌ను నియమించింది. సిద్దిపేట జిల్ల డీఆర్వోగా పనిచేస్తున్నారు. 

స్థానిక సంస్థలకూ అడిషనల్‌ కలెక్టర్‌..

కొత్తగా ఈసారి స్థానిక సంస్థల (లోకల్‌ బాడీస్‌)కు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అడిషనల్‌ కలెక్టర్‌ను నియమించింది. జిల్లాకు స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌గా బీఎస్‌ లతను నియమించింది. నేడు సీఎం కేసీఆర్‌తో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ ఉన్న సమయంలోనే ఒకరోజు ముందు పలు సంస్కరణలకు నాంది పలకడంతో పాటు బదిలీలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కలెక్టర్ల సమావేశం అనంతరం కొత్తగా జిల్లాకు రానున్న అడిషనల్‌ కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 

ఇద్దరు ఐఏఎస్‌లు.. ఇద్దరు అడిషనల్‌ కలెక్టర్లు.. 

జిల్లాలో పాలన ఇక పరుగులు పెట్టనుంది. నేడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ పాలనపరమైన విషయంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలోనే బదిలీలు జరగడంతో జిల్లా పాలనకు అదనపు బలం చేకూరింది. ఇప్పటికే నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి జితేశ్‌ వీ పాటిల్‌ను నియమించిన విషయం తెలిసిందే. కలెక్టర్‌గా నారాయణరెడ్డి సైతం ఇటీవలే ములుగు జిల్లా నుంచి బదిలీపై వచ్చి పాలనలతో తనదైన ముద్రను వేసుకుంటన్నారు. తాజాగా అడిషనల్‌ కలెక్టర్‌గా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ను నియమించింది. జాయింట్‌ కలెక్టర్‌గా రెవెన్యూపరమైన అంశాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కలెక్టర్‌కు పనిభారం తగ్గించి సమాంతరంగా అడిషనల్‌ కలెక్టర్లకు కూడా అన్ని శాఖలపై పట్టు ఉండేలా, అడ్మినిస్ట్రేషన్‌ మరింత పటిష్టంగా ఉండేందుకు ప్రభుత్వం పాలనాపరమైన మార్పులు చేస్తున్నది. అందులో భాగంగా జేసీకి బదులు అడిషనల్‌ కలెక్టర్‌గా పోస్టింగులు ఇస్తున్నది. దీంతో పాటు స్థానిక సంస్థల బలోపేతంపై కూడా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. దీనికోసం ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థలకు కూడా అడిషనల్‌ కలెక్టర్‌ను నియమించింది. దీంతో పాలన మరింత పరుగులు పెట్టనుంది. జిల్లాల విభజన తర్వాత చిన్న జిల్లాలుగా ఏర్పడడంతో పాలనపై పట్టు పెరిగింది. ఈ క్రమంలో ఒక్కో జిల్లాకు ఒక కలెక్టర్‌తో పాటు ఇద్దరు, ముగ్గురు అడిషనల్‌ కలెక్టర్లను నియమించడంతో పనిభారం సమాంతరంగా పంచుకొని సమస్యలు వెంటనే పరిష్కరించంతో పాటు సంక్షేమం ప్రతి ఒక్కరి దరికి చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ సంస్కరణకు నాంది పలికింది


logo