బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 11, 2020 , 02:04:32

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ కాన్ఫరెన్స్‌

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ కాన్ఫరెన్స్‌

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : కొత్త మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఈ కాన్ఫరెన్స్‌ ప్రారంభంకానుంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలు తీరుపై సీఎం కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు కొత్తగా ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలపైనా సుధీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు కలెక్టర్‌ నారాయణరెడ్డి జిల్లా సమగ్ర సమాచారంతో నేటి మీటింగుకు హాజరుకానున్నారు. జిల్లాకు కొత్తగా నియమించిన ఇద్దరు అడిషనల్‌ కలెక్టర్లు చంద్రశేఖర్‌, బీఎస్‌ లత కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిసింది. జిల్లాలో ఇంకా వీరు బాధ్యతలు స్వీకరించలేదు. అయినా సీఎం ఆదేశాల మేరకు ఈ సమావేశానికి ప్రత్యేకంగా హాజరవుతున్నట్లు తెలిసింది. 12న బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉంది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగా పల్లె ప్రగతి అమలు విజయవంతమైంది. ఇంకాకొన్ని  పనులు మిగిలి ఉన్నాయి. వీటి పురోగతిపై సమావేశంలో చర్చిస్తారు. హరితహారం, డంపింగ్‌యార్డులు, గ్రేవ్‌ యార్డులు, మార్కెటింగ్‌ వ్యవస్థ తదితర అంశాల అమలుపైనా సీఎం కేసీఆర్‌ లోతుగా చర్చించనున్నారు. పట్టణ ప్రగతికి కూడా ఇదే విధంగా ప్రాధాన్యమినిచ్చి ప్రారంభించేందుకు వీలుగా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రెండు కొత్త చట్టాల అమలు పకడ్బందీగా జిల్లాలో జరగాలనే ప్రధాన అంశంతో ఈ మీటింగు జరగనుంది. జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలున్నాయి. 

వీటి పరిధిలో చట్టం ఏ విధంగా అమలు చేయాలి? నిబంధనల మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై సుధీర్ఘంగా సీఎం చర్చించనున్నారు. అక్రమ లేఔట్లను పూర్తిగా నిర్మూలించేందుకు కొత్త చట్టంలో కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టారు. అనుమతుల విషయంలోనూ పారదర్శకతతో పాటు జవాబుదారీతనాన్ని మిళితం చేస్తూ చట్టంలో పొందుపర్చారు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో  అనుమతులు ఇవ్వకపోతే ఆ అంచనా విలువకు 25 రెట్లు పెనాల్టీ వేయాలనే నిబంధనలు ఉండడంతో అలసత్వానికి ఏమాత్రం తావులేకుండా.. సమయానికి అనుమతులు లభించే వీలుంది. వీటిని ఏ విధంగా కట్టుదిట్టంగా పకడ్బందీగా అమలు చేయాలనే విషయాలపై సీఎం కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లకు వివరిస్తారు. దీంతో పాటు కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపైనా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారని తెలుస్తోంది. logo