బుధవారం 27 మే 2020
Nizamabad - Feb 11, 2020 , 02:00:57

బాల్కొండ నియోజక వర్గంలో ఏకగ్రీవాల జోరు

బాల్కొండ నియోజక వర్గంలో ఏకగ్రీవాల జోరు

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ : సహకార ఎన్నికల్లో బాల్కొండ నియోజక వర్గం ఏకగ్రీవాలతో ఆదర్శంగా నిలిచింది. నియోజక వర్గంలో మొత్తం 20 సొసైటీలు ఉండగా అందులో పది సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా పది సొసైటీల్లోంచి తొమ్మిది సొసైటీల్లో ఆరుకు పైగా డైరెక్టర్ల స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఏకగ్రీవమైన పది సొసైటీలతో బాటు మిగతా 9 సొసైటీల్లో ఏకగ్రీవాల ట్రెండ్‌ కొనసాగింది.కాగా నియోజక వర్గంలో పది సొసైటీల్లో ఏకగ్రీవమైన డైరెక్టర్లలో 80 మెజార్టీకి పైగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఆరుకు పైగా స్థానాలు ఏకగ్రీవమైన చోట కూడా మెజార్టీ డైరెక్టర్లు టీఆర్‌ఎస్‌ పార్టీ వారే ఉన్నారు. దీంతో బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం 20కి 20 సొసైటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

20 సొసైటీలకు గానూ.. 10 సొసైటీలు ఏకగ్రీవం కావడం, మిగతా 10 లోంచి 9 సొసైటీ లు అధికారికంగా ఏకగ్రీవం కాకున్నా మెజార్టీ టీసీలను ఏకగ్రీవం చేసుకున్న తీరు రాష్ట్ర స్థాయి లో రికార్డుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏకగ్రీమైన పది సొసైటీల్లో, ఆరుకు పైగా స్థానాలు ఏకగ్రీవమైన సొసైటీల్లో డైరెక్లర్లుగా ఏకగ్రీవమైన వారు ఎక్కువగా టీఆర్‌ఎస్‌ పార్టీ వారే ఉండడం తో ఇది రైతులు టీఆర్‌ఎస్‌ పార్టీకి , నియోజక వర్గంలో సాగునీటి రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి వెన్నంటి ఉన్నామని చాటినట్లుగా పేర్కొంటున్నారు. రైతులు అందించిన సంపూర్ణ మద్దతుపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. సహకార ఎన్నికల్లో ఏకగ్రీవాలు అందించిన ఉమ్మడి జిల్లా రైతులకు ధన్యవాదాలు తెలిపారు.


logo