గురువారం 28 మే 2020
Nizamabad - Feb 10, 2020 , 02:22:42

డీసీఎంఎస్‌ విభజన?

డీసీఎంఎస్‌ విభజన?

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (ఐడీసీఎంఎస్‌)ని విభజించే ఆలోచనలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్న దా? నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు వేర్వేరుగా డీసీఎంఎస్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోనుందా? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఇదే విషయం చర్చనీయాంశమవుతున్న ది. జిల్లా సహకార సంఘ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో తాజాగా డీసీఎంఎస్‌ విభజనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) విభజన జరగలేదు. ఉమ్మడి జిల్లాకు ఒకే డీసీసీబీ ఉంది. ఈ మేరకు ఎన్నికలు కూడా ఉమ్మడి జిల్లాకే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ఘట్టం కూడా పూర్తయింది. నేడు నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఎన్నికలు 15న జరగనున్నాయి. 16న పీఏసీఎస్‌ల చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. ఉమ్మడి జిల్లా నుంచి 144 సొసైటీల చైర్మన్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌, డైరెక్టర్ల ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అదే సమయంలో డీసీఎంఎస్‌ ఎన్నికల్లో కూడా వీరు ఓటేస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనుంది. ఇదే సమయంలో డీసీఎంఎస్‌ విభజనపై ప్ర భుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డీసీసీబీ విభజనలో పలు నిబంధనలు అడ్డురావడంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాకు ఒకే డీసీసీబీ ఉండిపోయింది. ఆర్బీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉండడంతో డీసీసీబీ విభజన సాధ్యంకాలేదు. కానీ డీసీఎంఎస్‌ విభజనకు ఈ నిబంధనలేవీ అడ్డుకావని తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారిస్తే ఈ ఎన్నికల్లోనే డీసీఎంఎస్‌ విభజన చేపట్టి రెండు జిల్లాలకు వేర్వేరుగా చైర్మన్ల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. డీసీఎంఎస్‌కు చైర్మన్‌గా కామారెడ్డి జిల్లా నుంచి ముజిబుద్దీన్‌ వ్యవహరించారు. ఉమ్మడి జిల్లా ఎన్నికలు కావడంతో ఇరుచోట్ల నుంచి చైర్మన్‌ పదవి కోసం పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య పె రిగింది. డీసీఎంఎస్‌ విభజన జరిగితే రెండు జిల్లాల నుంచి ఆశావహులకు అవకాశం ఉంటుంది. చైర్మన్‌, డైరెక్టర్‌ పోస్టు లు అదనంగా సమకూరనున్నాయి. దీంతో ఈ విభజనపై ప్రభుత్వం సీరియస్‌గా కసరత్తు మొదలుపెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 16న పీఏసీఎస్‌ల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక పూర్తి కాగానే ఈ విభజనపై స్పష్టత రానున్నది. విభజన అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో ఆ మేరకు సాధ్యసాధ్యాలపై అధికారులతో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. విభజిస్తే పాలనపరంగా రెండు జిల్లాలకు అధికారుల విభజన ఎలా ఉండాలి? కార్యాలయం ఏర్పాటు? స్టేషనరీ తదితర సౌకర్యాల కల్పన గురించి చర్చిస్తున్నారు. సొసైటీల చైర్మన్ల ఎన్నిక తర్వాత త్వరలోనే డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున డీసీఎంఎస్‌ విభజన అంశంపై త్వరగా నిర్ణయం తీసుకొనేందుకు వీలుగా సాధ్యసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 


logo